ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో జగన్ అండ్ టీమ్ కొత్త నాటకానికి తెరలేపింది. ఈ కేసులో అప్రూవర్ దొరికారని మైండ్ గేమ్ మొదలు పెట్టింది. దీంట్లో మొత్తం 37 మందిని ఏపీ సీఐడీ నిందితులుగా చేర్చగా, ఏ – 13 గా ఉన్న సీమెన్స్ కంపెనీ ప్రతినిధిగా చెప్తున్న సుధీష్ చంద్రకాంత్ షా ఉన్నారు. ఈయనే అప్రూవర్‌గా మారినట్లుగా ప్రకటించారు. ఈయనపై జగన్ టీమే బెదిరింపులకు పాల్పడి ఇలా చేయించినట్లుగా తెలుస్తోంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తాను అన్ని వివరాలు వెల్లడిస్తానని చంద్రకాంత్ తో విజయవాడ ఏసీబీ కోర్టులో బలవంతంగా పిటిషన్ వేయించారు. ధర్మాసనం దాన్ని విచారణ చేసింది. డిసెంబర్ 5న కోర్టులో ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించింది. కానీ, ఆయన హాజరయ్యేందుకు రెడీగా లేరని తెలుస్తోంది. ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. అసలు చంద్రకాంత్ షా అనే వ్యక్తి సిమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలకు చెందిన ప్రతినిధే కాదు. డిజైన్ టెక్ ఏపీ స్కిల్ సెంటర్లకు పరికరాలు సరఫరా చేసే క్రమంలో.. అవి కొనుగోలు చేసిన ఓ సంస్థకు అడ్వైజర్ గా ఉన్నారని చెబుతున్నారు. అలాంటి ఈయన పేరును ఎఫ్ఐఆర్‌లో పెట్టి, డబ్బు ఆశచూపి, తరవాత బెదిరింపులకు గురి చేసి బలవంతంగా అప్రూవర్ గేమ్ ఆడుతున్నారు.
జగన్ ప్రభుత్వం ఆడుతున్న ఆ అప్రూవర్ మైండ్ గేమ్ తో టీడీపీలో కాస్త మానసిక స్థైర్యం దెబ్బతింటుందని అంచనా వేశారు. కానీ, దాంతో ఏమీ లాభం లేదని తేలిపోయింది. ఎందుకంటే ఈ అప్రూవర్ గేమ్ ను టీడీపీ తేలిగ్గా తీసుకుంది.
అదీకాక, ఈ కేసులో అందివచ్చిన ఏ అవకాశాన్నీ జగన్ అండ్ టీం వదలట్లేదు. ఇటీవలే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును సీబీఐకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని జగన్ ప్రభుత్వం కోర్టుకు తెలిపినట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసులో అసలు ఆధారాలే లేనందున కేసు ఎక్కువ కాలం నిలబడకపోగా కొట్టేసే అవకాశం ఉంది. అందుకే దీన్ని మరింత కాలం పొడిగించే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో ఈ పిటిషన్ వేయించినట్లుగా భావిస్తున్నారు. కేసు సీబీఐ చేతికి వెళ్తే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది కాబట్టి, విచారణ మరికొన్ని నెలలపాటు సాగే అవకాశం ఉంటుందని వైఎస్ఆర్ సీపీ ఆలోచనగా తెలుస్తోంది.