కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దృష్టి అంతా గనుల మీదే ఉంటుందా? కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో కేజీఎఫ్ రూపొందించిన ప్రశాంత్ నీల్ తాజాగా ప్రభాస్ తో ‘సలార్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా గనుల నేపథ్యంలోనే సాగుతుంది. కాకపోతే ఇది బంగారం కాదు బ్లాక్ గోల్డ్ అనుకోవాలి. అంటే బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథ. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్జీ 3 పరిధిలో గనుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సలార్ అంటే లీడర్ అనే అర్థం వస్తుంది.
ఇందులో హీరో కరడుగట్టిన గూండా అని తెలుస్తోంది. ఈ సినిమా క్యాప్షన్ లోనే ఆ సంగతి తెలుస్తోంది. మరి ఇలాంటి గూండా ఢీకొనాలంటే అతనికన్నా పెద్ద గూండా కావాల్సిందే. అందుకు ఓ వ్యక్తిని ఎంచుకున్నారు. ఆ విలన్ మరెవరో కాదు కన్నడ నటుడు మధు గురుస్వామి. ప్రస్తుతం ఇతని పేరు వైరల్ అవుతోంది. ప్రభాస్ ఎదురించే విలన్ గా ప్రచారం జరుగుతోంది.
ఇంతకుముందు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సాక్షీయంలో అతను విలన్ గా నటించాడు. అయితే ఇతను ప్రధాన విలనా? విలన్ లలో ఒకరా అన్న సంగతి ఇంకా పూర్తిగా తెలియదు. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రామగుండం ప్రాంతంలో ఇప్పటికే కొంత భాగం షూటింగును ఈ సినిమా పూర్తిచేసుకుంది.