ఏపీలో రైతులు కాడి పడేశారు. నివర్ దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన కోస్తా జిల్లాల రైతులు రబీ సాగుకు ముందుకు రావడం లేదు. రబీ సీజన్ ముగిసినా నేటికీ సగం విస్తీర్ణంలో కూడా పంటలు వేయకపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరున్నా సాగుకు రైతులు ముందుకు రాకపోవడం వ్యవసాయరంగం సంక్షోభానికి సంకేతాలని వ్యవసాయరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీప్ సాగులో భారీ నష్టాలు రావడం, కనీసం పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో రబీ సాగుకు రైతులు ముందడుగు వేయడం లేదని తెలుస్తోంది.
ఎంత విస్తీర్ణంలో సాగు చేశారంటే..
ఏపీలో రబీ సీజన్‌లో 59 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తూ ఉంటారు. వరి,మినుము,శనగ,పెసర, తృణధాన్యాలు ప్రధానంగా రబీలో సాగు చేస్తున్నారు. రబీలో 17 లక్షల ఎకరాల్లో ఏటా వరినాట్లు వేస్తారు. కానీ ఈ ఏడాది 6 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు వరి నాట్లు పూర్తి చేశారు. రబీ సీజన్ ముగిసిపోయినా, రైతులు వరిసాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరున్నా, వరి సాగు చేసేందుకు రైతులు ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం నివర్ తుఫాను తీవ్ర నష్టాలను మిగల్చడమే. దీనికి తోడు ప్రభుత్వం అరకొర సాయం, అంటే ఒక్కో రైతుకు రూ.2400 పరిహారం అందించి చేతులు దులిపేసుకుంది. నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.1200 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం భారీగా ప్రచారం చేసుకుంది. ఒక్కో రైతుకు చేరింది కేవలం రూ.2400 మాత్రమే. నివర్ తుఫాను వల్ల ఒక్కో రైతుకు సగటున రూ.1,20,000 వాటిల్లిందని రైతు సంఘాలు అంచనా వేశాయి. ఇందులో ప్రభుత్వం కేవలం రూ.2,400 సాయం చేసి చేతులు దులిపేసుకుందని, రబీ సాగుకు వేల రూపాయల పెట్టుబడులు తీసుకురాలేక రైతులు, కౌలు రైతులు సాగు చేసేందుకు ముందుకు రావడం లేదని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.![]()

అపరాల సాగూ అంతంత మాత్రమే..
సాగునీటి సదుపాయం పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్, రబీల్లో వరిసాగు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది మాత్రం రబీ సాగుకు నీరున్నా రైతులు వరి సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇక అపరాల పంటల సాగు పరిస్థితి కూడా అలాగే తయారైంది. రబీలో 6 లక్షల ఎకరాల్లో మినుము సాగు చేయాల్సి ఉంది. రబీ సీజన్ ముగిసినా నేటికీ అది 3 లక్షల ఎకరాలు దాటలేదు. ఇక 3 లక్షల ఎకరాల్లో పెసర సాగు విస్తీర్ణం కాగా ఈ ఏడాది 1 లక్ష ఎకరాలను కూడా మించలేదని వ్యవసాయశాఖ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. రబీలో వరి తరవాత గరిష్ఠంగా సాగు చేసే శనగ పంట విస్తీర్ణం 12 లక్షల ఎకరాలు. ఈ రబీలో కేవలం 8 లక్షల ఎకరాల్లోనే పంట వేశారు. ఈ పంటను అధికంగా సాగు చేసే ప్రకాశం, కర్నూలు జిల్లా రైతులు కనీసం కూలీ ఖర్చుల కూడా రాకపోవడంతో శనగ సాగుకు స్వస్తి పలుకుతున్నారు. శనగ పంటకు మద్దతు ధర కూడా దక్కపోవడంతో మూడేళ్లుగా శీతల గిడ్డంగుల్లో సరకు నిల్వ చేసిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈ ఏడాది శనగ సాగుకు రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
ప్రభుత్వ సాయం అరకొరే..
కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు ఏటా ఒక్కో రైతుకు రూ.13500 సహాయం చేస్తున్నాయి. ఇది కూడా అందరికీ అందడం లేదు. కేంద్ర మూడు దఫాలుగా ఒక్కోసారి రూ.2000 చొప్పున ఏపీలో 30 లక్షల మంది రైతులకు మాత్రమే సాయం చేస్తోంది. ఏపీలో మొత్తం రైతుల సంఖ్య 80 లక్షలు ఉంటే, కేంద్ర సాయం కేవలం 30 లక్షల మందికి మాత్రమే అందుతోంది. ఈ పథకంలో కొత్తగా లబ్దిదారుల జాబితాలో రైతుల పేర్లను చేర్చుకునే అవకాశం కూడా లేదు. ఇక ఏపీ ప్రభుత్వం మూడు దఫాలుగా ఏటా 48 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6500 జమ చేస్తోంది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు సగటున రూ.13,500 సాయం అందిస్తున్నాయి. అయినా ప్రకృతి విపత్తుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖరీఫ్ పంటలను నివర్ తుఫాను తీవ్రంగా నష్ట పరిచింది. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విదిల్చలేదు. ఇక రాష్ట ప్రభుత్వం రైతులు నష్టపోయిన మొత్తంలో కేవలం 2 శాతం ఇచ్చి చేతులు దులిపేసుకుంది. దీంతో రైతులు పంటల సాగు అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రబీ సాగు సగానికి పడిపోవడానికి ఇదే ప్రధాన కారణమని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పంటల బీమా ఏపీలో అమలు కాకపోవడం కూడా రైతులకు ప్రధాన అవరోధంగా మారింది. ఏపీ ప్రభుత్వమే బీమా కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఖరీఫ్‌లో కూడా పూర్తి స్థాయిలో పంటలు సాగుకు నోచుకునే అవకాశం కనిపించడం లేదని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.











