నిజమే… వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ఇక తప్పించుకుని పారిపోవడం కుదరదు. ఎందుకంటే…ఆయనపై ఏపీ సీఐడీ అధికారులు ఏకంగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అంటే… పోలీసుల కళ్లు తప్పి దేశం దాటిపోయేందుకు సాయిరెడ్డి ప్రయత్నిస్తే… ఆ యత్నాలు ఫలించవన్న మాట. ఎందుకంటే… లుక్ అవుట్ నోటీసులు జారీ అయిన వెంటనే… సదరు నోటీసులు దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు చేరిపోతాయి కాబట్టి. ఇప్పటికే సాయిరెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ నోటీసులు దేశంలోని అన్నిఎయిర్ పోర్టులకు చేరిపోయాయి. అంటే… దేశం దాటి వెళ్లేందుకు సాయిరెడ్డి దేశంలోని ఏ ఎయిర్ పోర్టుకు వెళ్లినా…ఆయనకు అడ్డగింతలే స్వాగతం చెబుతాయి. వెరసి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా… కోర్టుల నుంచి అనుమతి తీసుకోకుండా సాయిరెడ్డి దేశం దాటి పారిపోయేందుకు అసలు ఆస్కారమే లేదన్న మాట. సాయిరెడ్దితో పాటు వైసీపీకి చెందిన మరో కీలక నేత, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, లిక్కర్ కేసులో అరెస్టై బెయిల్ పై విడుడల అయిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిలపైనా లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.
కాకినాడ సీ పోర్టుతో పాటు కాకినాడ సెజ్ ను కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి అరబిందో ఫార్మాకు చెందిన అరబిందో రియాల్టీ ఏ రీతిన లాక్కుందన్న దానిపై ఏపీ సీఐడీ మంగళవారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనను బెదిరించి, అక్రమ కేసులు పెడతామని, కుటుంబ సభ్యులను కూడా జైల్లోకి తోస్తామని బెదిరించి మరీ తన నుంచి కంపెనీలను లాక్కున్నారని స్వయంగా కేవీ రావు మంగళవారం సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగానే సాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలతో పాటు అరబిందో రియాల్టీలపై కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు… ఈ కేసులోని నిందితులు దేశం దాటి పారిపోకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి సాయిరెడ్డిపై ఇప్పటికే ఓ లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో జగన్ తో పాటు సహనిందితుడిగా ఉన్న సాయిరెడ్డిపై ఇదివరకే సీబీఐ, ఈడీలు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాయి. ఈ కారణంగానే ఏదేనీ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే… సాయిరెడ్డి కోర్టు అనుమతి తీసుకుంటున్నారు. తాజాగా ఏపీ సీఐడీ అదికారులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులు సాయిరెడ్డిపై రెండోవన్న మాట.
ఓ రాష్ట్రంలో అదికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎంపీగా ఉండటమే కాకుండా… ఆ పార్టీకి సంబంధించి పార్లమెంటులో ఆ పార్టీ నేతగా ఉన్న సాయిరెడ్డి… కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్ లను అరబిందో రియాల్టీ పేరిట జగన్ పురం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ ఎంపీనన్న విషయాన్ని పక్కన పెట్టేసిన సాయిరెడ్డి… నేరుగా కేవీ రావుకు ఫోన్ చేశాడు. కాకినాడ సీపోర్టు, సెజ్ లకు సంబంధించి విక్రాంత్ రెడ్డితో మాట్లాడుకోవాలని, ఈ చర్చల్లో తన అల్లుడికి సోదరుడైన శరత్ చంద్రారెడ్డి కూడా అక్కడే ఉంటారని కూడా సాయిరెడ్ది చెప్పారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక కేవీ రావు కొట్టుమిట్టాడుతూ ఉంటే… మరికొన్ని రోజులకు విక్రాంత్ రెడ్డి నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. హైదరాబాద్ లోని తన నివాసానికి రావాలని విక్రాంత్ రెడ్డి ఆదేశించడంతో కేవీ రావుకు ప్రత్యామ్నాయమేమీ లేకుండానే పోయింది. అసలే అధికారంలో ఉన్న పార్టీ… ఆపై ఆ పార్టీకి చెందిన పార్లమెంటరీ పార్టీ నేత నుంచి ఫోన్ కాల్… ఇప్పుడు స్వయానా సీఎం జగన్ కు పినతల్లి కుమారుడైన విక్రాంత్ రెడ్డి నుంచి ఫోన్…కేవీ రావుకు మార్గాంతరం కనిపించలేదు. తిన్నగా విక్రాంత్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు.
కేవీ రావును ఏ రీతిన లొంగదీసుకోవాలన్న విషయంపై అప్పటికే రిహార్సల్స్ చేసిన విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు ఓ తప్పుడు నివేదికను రావు ముందు పెట్టారు. కాకినాడ సీపోర్టు ప్రభుత్వానికి దాదాపుగా రూ.1000 కోట్ల మేర పన్ను బకాయిలు ఉందని, తాము చెప్పినట్లుగా వినకపోతే… పన్ను బకాయిలను రాబట్టడంతో పాటుగా పోలీసు కేసులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని విక్రాంత్ రెడ్డి ఆయనను బెదిరించారు. అయితే ఆ నివేదిక తప్పుడుదని కేవీ రావు వాదించగా… మీపై, మీ కుటుంబం సభ్యులపై అక్రమ కేసులు పెడతాం, అందరినీ జైళ్లలో తోయిస్తాం అంటూ విక్రాంత్ రెడ్డి ఆయనను భయపెట్టారు. ఈ బెదిరింపులకు నిజంగానే భయపడిపోయిన కేవీ రావు వారు చెప్పినట్లుగానే నడుచుకున్నారు. చివరకు వారి వెంట సీఎం జగన్ వద్దకు వెళ్లినప్పుడు కూడా సీఎం జగన్ కూడా విక్రాంత్ రెడ్డి చెప్పినట్లుగా చేయండని చెప్పడంతో ఇక కేవీ రావు అన్నీ వదులుకోవడానికి సిద్ధమైపోయారు. తాజాగా టీడీపీ అధికారంలోకి రావడంతో కేవీ రావుకు ధైర్యం వచ్చింది. తనను బెదిరింపులకు గురి చేసిన వారిపై తాజాగా ఆయన ఫిర్యాదు చేశారు. ఫలితంగా సాయిరెడ్డితో పాటు విక్రాంత్, శరత్ చంద్రలు రౌండప్ అయిపోయారు.