టీడీపీని వీడి 2019 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావుకు చెందిన గ్రానైట్ లీజులను రద్దు చేశారు. ఎస్ ఆర్ ఇన్ఫ్రా పేరుతో ప్రకాశం జిల్లాలో గరికపాటికి 11 మైనింగ్ గనులు ఉన్నాయి. బీజేపీలో చేరాం కదా? సేఫ్ అని భావించారు. కానీ వైసీపీ నేతలు వదలలేదు. గరికపాటి గ్రానైట్ గనులకు నోటీసులు ఇచ్చారు. రూ.200 కోట్ల అపరాధ రుసుం విధించారు. గడువు తీరినా అపరాధ రుసుం చెల్లించలేదని తాజాగా గరికపాటి గ్రానైట్ లీజులను రద్దు చేశారు.
బాబు సన్నిహితుడు కావడమే కారణమా?
రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అంత్యంత సన్నిహితుడు. వ్యాపారాల రక్షణ కోసం 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయాక బీజేపీని ఆశ్రయించిన ఆ నలుగురు రాజ్యసభ సభ్యుల్లో గరికపాటి ఒకరు. అయినా ఆయన చంద్రబాబుకు విధేయుడే. అంతేకాదు, టీడీపీకి ఆర్థికంగా వెన్నెముక అనే ప్రచారం కూడా ఉంది. నిలుస్తున్నారు. నేటికీ టీడీపీకి రెండో కంటికి తెలియకుండా ఆర్థిక సాయం చేస్తున్న వ్యక్తిగా గరికపాటి గురించి చెబుతుంటారు. ఎక్కడా పెద్దగా ఆర్భాటం చేయని గరికపాటి చడీచప్పుడు కాకుండా పనులు చక్కబెట్టుకుపోతారు. మంచి వ్యాపారవేత్తగా పేరుంది. ఎక్కడా వివాదాలకు తావులేదు. టీడీపీకి ఆర్థికంగా వెన్నెముకగా నిలిచే అతి కొద్ది మందిలో గరికపాటి ఉంటారు. అందుకే గరికపాటి గ్రానైట్ వ్యాపారాలను వైసీపీ ప్రభుత్వం సీజ్ చేసింది.
బీజేపీలో చేరిన టీడీపీ నేతలకు రక్షణ లేదా?
టీడీపీని వీడి బీజేపీలో చేరినా వదల బొమ్మాళీ అంటున్నారు వైసీపీ నేతలు. మనుషులు బీజేపీలో ఉన్నా వారి ఆత్మ టీడీపీలోనే ఉందని వారి భావన. అందుకే టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కోవడం సులువవుతుందని ఈ తరహా రాజకీయాలకు తెరలేపారు. అందుకే టీడీపీకి అండగా ఉండే వ్యాపార సంస్థలు, వ్యక్తుల మీద ఫోకస్ పెంచుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
తరవాత టార్గెట్ ఎవరు?
రాబోయే కొద్ది రోజుల్లో మరికొందరి వ్యాపారాలపై కూడా ఇదే తరహా దాడులు కొనసాగుతాయని తెలుస్తోంది. ఇదే కోవలో పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆంజనేయులు, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, సంగం డెయిరీ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత దూలిపాళ నరేంధ్ర, విజయవాడ ఎంపీ కేశినేని నానీ ఉన్నారు. ఈ నాయకులు పలు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వాటిపై దృష్టి పెట్టారు. ముందుగా వారి వ్యాపారాల్లో లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేయడం, తరవాత సీజ్ చేయడం లక్ష్యంగా వైసీపీ అధిష్ఠానం ముందుకు సాగుతోందని తెలుస్తోంది.