బాలీవుడ్ యంగ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపూత్ కేసులో ఆయన మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి కారణమంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సుశాంత్ ను మానసికంగా వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె ప్రేరేపించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ముందు ఆమె పలుమార్లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె సంచలన కామెంట్లు చేసింది. ‘ సుశాంత్ ను ప్రేమించడమే నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పని’ ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ ఒక్క నిర్ణయంతో తన జీవితం తలకిందులు అయిందని ఆమె వాపోయారు.
సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) లాంటి సంస్థల విచారణను ఆమె ఎదురుకుంటున్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ తమ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే పలు కీలక సాక్ష్యాలను సొంతం చేసుకున్న సీబీఐ పలువురిని ప్రశ్నించింది. ఇదే సమయంలో రియాకు చెందిన ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆమెకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. తన కుమారుడి మరణం తరువాత అతని అకౌంట్ నుంచి 15 కోట్లు బదలాయింపు జరిగిందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదుతో ఈడీ కూడా రంగంలోకి దిగింది.
వరుసగా విచారణలు ఎదురుకుంటున్న రియా ‘ఏ విచారణ సంస్థ ఇంటరాగేషన్ చేసినా తాను అన్నీ విషయాలు చెప్పానని ఏ విషయాన్ని తాను దాచిపెట్టలేదని’ స్పష్టం చేశారు. తాను జీవితంలో డ్రగ్స్ వాడలేదని అవసరమైతే బ్లడ్ టెస్ట్ కు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తాను అక్రమంగా డబ్బులు తరలించలేదని ఆమె తెలిపారు. సుశాంత్ తమ కుటుంబంతో ఎంతో చనువుగా ఉండేవాడని కానీ అతని మరణం తరువాత తమను దోషులుగా చూస్తున్నారని ఆమె ఆవేదన తెలిపారు. జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా ఆత్మహత్య అనే కోణంలో ముంబై పోలీసులు విచారణ జరిపారు. కానీ లోతుగా విచారణ జరపాలని డిమాండులు రావడంతో ముందుగా కేంద్రం, ఆ తరువాత సుప్రీంకోర్ట్ సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.










