తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీకి వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఐతే ఈ ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేస్తున్న విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు కల్తీ నెయ్యి పంపినట్లు అధికారులు గుర్తించారు. విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకూ భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు.
తిరుపతిలోని డెయిరీకి కమీషన్లు చెల్లించి ఆ కంపెనీ పేరుతోనే కల్తీ నెయ్యి పంపినట్లు విచారణాధికారులు నిగ్గు తేల్చారు. ఇప్పటివరకు టీటీడీకి మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో A-12గా ఉన్న భోలేబాబా డెయిరీ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణా నెల్లూరు ACB కోర్టులో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఏపీపీ జయశేఖర్ వ్యతిరేకిస్తూ ఈనెల 17న వినిపించిన వాదనల సందర్భంగా ఈ ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుడు మాస్టర్‌మైండ్ అని, బయటకు వస్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తాడని, సాక్షులను ప్రభావితం చేస్తాడని APP వాదించగా ఏకీభవించిన న్యాయమూర్తి సరస్వతి గురువారం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు.
ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా డెయిరీని 2022లో తితిదే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన తర్వాత ‘మాల్‌గంగ’ అనే డెయిరీని తెరపైకి తీసుకొచ్చింది. ఈ కంపెనీకి కమీషన్ చెల్లించి..సుగంధ ఆయిల్స్, పామోలిన్ తదితర పదార్థాలతో తయారుచేసిన కల్తీ నెయ్యిని పరోక్షంగా భోలేబాబా డెయిరీనే టీటీడీకి పంపిందని వాదనల సందర్భంగా ఏపీపీ పేర్కొన్నారు. కొన్నిసంస్థల దగ్గర నెయ్యి కొనుగోలు చేసి తితిదేకు సరఫరా చేశామని హరిమోహన్ రాణా గతంలో తెలిపారని.. అధికారుల విచారణలో ఇదంతా అవాస్తమని తేలిందన్నారు.