తెలుగు నేలలో తెలుగు దేశం పార్టీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు ప్రజల ఆత్మ గౌరవ నినాదంతోనే ఆ పార్టీ పుట్టుకొచ్చింది. ఇక తెలుగు నేల విభజనకు సంబంధించి అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఎలుగెత్తిన పార్టీ కూడా టీడీపీనే. అలాంటి పార్టీకి ఇప్పుడు తెలంగాణలో ఘోర అవమానం జరిగింది. ఆ పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లోకి లాగేసుకున్న సీఎం కేసీఆర్… ఆదివారం దళితుల సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి మాత్రం ఆ పార్టీకి కనీసం ఆహ్వానం కూడా పంపలేదు. అసెంబ్లీలో అసలుకే చోటు దక్కని సీపీఎం, సీపీఐ పార్టీలకు ఆహ్వానం పలికిన కేసీఆర్… రెండు సీట్లను గెలుచుకుని తన ఉనికిని చాటుకున్న టీడీపీకి మాత్రం ఇన్విటేషన్ పంపకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి.
2014లో టీడీపీకి 15 సీట్లు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక జరిగిన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 సీట్లను గెలిస్తే.. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు దక్కాయి. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అందరికంటే ముందు సమ్మతి తెలిపినా… తెలంగాణ ద్రోహి అని ముద్ర పడిపోయిన టీడీపీకి ఏకంగా 15 సీట్లు దక్కాయి. అయితే ఆ తర్వాత అధికారం చేపట్టిన కేసీఆర్… తెలంగాణలో టీడీపీ అన్న పదమే వినిపించరాదన్న దిశగా కీలక అడుగులు వేశారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరిట టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరినీ ఒక్కొక్కరిగానే టీఆర్ఎస్ లోకి లాగేశారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులను పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేశారు. అయినా ఇప్పటికీ తెలంగాణ గ్రామాల్లో టీడీపీకి మంచి పట్టే ఉంది.
ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను లాగేశారు
ఇక టీడీపీ ఖతమైపోయిందని అని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాను తట్టుకుని నిలబడిన టీడీపీ రెండు సీట్లను దక్కించుకుని తన సత్తా చాటింది. తెలంగాణ నుంచి తనను ఎవరూ తొలగించలేరని కూడా ఆ పార్టీ నిరూపించింది. అయితే కేసీఆర్ మార్కు ఆపరేషన్ కారణంగా టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. తెలంగాణ అసెంబ్లీలో టీ టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేశారు. అయినా కూడా టీడీపీకి ఇప్పటికీ తెలంగాణలో ఓట్లున్నాయి. ఓటర్లున్నారు. చిన్నాచితకా పార్టీలన్నింటి ఓట్లను మించిన ఓటు షేరింగ్ ఉంది.
టీడీపీపై కేసీఆర్ కు ఎందుకంత వ్యతిరేకత?
ఇలాంటి నేపథ్యంలో దళితుల అభ్యున్నతి గురించి చర్చిద్దామంటూ అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపిన సీఎం కేసీఆర్ టీడీపీకి మాత్రం ఆహ్వానం పలకకపోవడం నిజంగానే విడ్డూరంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో గడచిన కొంతకాలంగా అసలు చోటే దక్కని సీపీఎం, సీపీఐ పార్టీలకు ఆహ్వానం పంపిన కేసీఆర్… టీడీపీని పిలవకపోవడం గమనార్హం. అంటే… టీడీపీ అంటే కేసీఆర్ కు ఇప్పటికీ వ్యతిరేకతేనని చెప్పక తప్పదు. అయినా ఇష్టమొచ్చిన పార్టీలను పిలిచి, ఇష్టంలేని పార్టీలకు ఆహ్వానం పలకకపోవడానికి ఈ అఖిలపక్షమేమీ కేసీఆర్ సొంతింటి వ్యవహారం కాదు కదా. తెలంగాణ ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న ఈ తరహా సమావేశాలకు అన్ని పార్టీలను పిలవాల్సిన గురుతర బాధ్యత సీఎంగా కేసీఆర్ పై ఉంది కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.