చైర్ పర్సన్ గా ఒకరి ఎంపిక రెండు చోట్ల ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అందులో ఒకటి మాన్సాస్ ట్రస్ట్ అయితే.. ఇంకొకటి సింహాచలం దేవస్థానం.
ఎన్నో ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎటువంటి మచ్చలేని లేని నాయకుడిగా ఎదిగిన అశోక్ గజపతిరాజు ఈ రెండింటికి పారంపర్యంగా వచ్చిన చైర్మన్ హోదాలో కొనసాగారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను తప్పిస్తూ సంచయిత గజపతి రాజును చైర్ పర్సన్ గా నియమించినప్పటి నుంచి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగమే ఈ వో లు తమ బాధ్యతల నుంచి తప్పించండి అంటూ ఉన్నతాధికారులకు మొరపెట్టుకోవడం.
సంచయిత పాలనలో ఏం జరుగుతోంది?
‘సంచయిత’ చాలాకాలంగా పాపులర్‌గా ఉన్న అమ్మాయి.. ‘సంచయిత గజపతి రాజు’గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుని.. ఒక్కసారిగా తెరమీదకు వచ్చి.. గజపతుల కుటుంబ వారసత్వ సారథ్య అధికారాన్ని చేపట్టారు. ఆ విషయంపై ఎటూ కోర్టు కేసు నడుస్తోంది. ఆ లోతుల్లోకి వెళ్లడం అనవసరం. కానీ.. ఆమె మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గాను, సింహాచలం దేవస్థాన పాలకమండలి అధ్యక్ష హోదాలోను పరిపాలన ప్రారంభించిన తర్వాత.. రేకెత్తుతున్న అనేకానేక వివాదాలే.. ఇప్పుడు కొత్త ప్రశ్నలకు తావిస్తున్నాయి. మన్సాస్ ట్రస్టుకు ఇన్‌చార్జి ఈవోగా ఉన్న మాధవి.. తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు లేఖ రాసిన నేపథ్యంలో సంచయిత పరిపాలన- మరోమారు చర్చనీయాంశం అవుతోంది.
సంచయిత వచ్చినప్పటినుంచి.. సింహాచలం దేవస్థానం అతిథి భవనంలో ఉంటూ.. దేవస్థానం రికార్డులను అన్నింటినీ.. కార్తీక్ అనే ప్రెవేటు వ్యక్తి పరిశీలించడం పై అనేక ఆరోపణలు వచ్చాయి. సంచయిత ప్రాపకంతోనే ఆయన ఆ పని చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఎవరో, ఎక్కడినుంచి వచ్చారో.. ఏ హోదాలో ఆ రికార్డుల తనిఖీ చేస్తూ వచ్చారోక ఎవ్వరికీ తెలియదు. కానీ.. అదే ప్రెవేటు వ్యక్తిని ఓఎస్డీగా నియమించాలనే నిర్ణయం కూడా ట్రస్టు బోర్డు తీసుకుంది. ఆదేశాలు ఇంకా రాకపోయినప్పటికీ.. ఈ నిర్ణయం పైన అనేక అభ్యంతరాలు ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో.. ఆలయానికి కార్యనిర్వహణ అధికారిగా ఉన్న భ్రమరాంబ తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా ఉన్నతాధికార్లను కోరారు. కారణాలు ఆమె వెల్లడించకపోయినా.. ఆలయ నిర్వహణలో జరుగుతున్న అనేక అవకతవకల నేపథ్యంలో.. చైర్ పర్సన్ తో బహిరంగంగా విభేదించ లేక ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో తాను ఎలాంటి కేసుల్లో ఇరుక్కోవలసి వస్తుందో అనే భయంతోనే ఆమె వెళ్లిపోయినట్లుగా ప్రజలు అనుకున్నారు. ఆమెను తప్పించి.. ఇన్చార్జి బాధ్యతలు మరొకరికి అప్పగించారు.
అదే సమయంలో మన్సాస్ ట్రస్టుకు కార్యనిర్వహణాధికారిగా ఉన్న మాధవి కూడా బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ.. దేవాదాయ కమిషనర్ కు లేఖ రాయడం విశేషం. మన్సాస్ ట్రస్టులో ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయో.. వాటి పరిణామాలు ఎలా ఉండబోతాయని జడుసుకుని ఆమె పక్కకు తప్పుకోదలచుకున్నారోనని.. ప్రజల్లో చర్చ నడుస్తోంది.
గతంలో జరిగిన అవకతవకలే కారణమా?
మాన్సాస్ ట్రస్ట్ లో గతంలో అనేక అవకతవకలు జరిగాయని, వాటిని వెలికితీసేందుకు సంచయిత బృందం కొంతకాలంగా తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ట్రస్ట్ కు సంబంధించిన అన్ని లావాదేవీలపై భూతద్దం లో వెతికి వెతికి లోపాలను బయటపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అశోక్ గజపతిని కార్నర్ చేసే అవకాశం లేకపోలేదని ప్రచారంలో ఉంది. దాని వల్ల పరోక్షంగా ఆమె ఎంపిక సరైనది అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. అదే కాకుండా ట్రస్టుకు చెందిన విలువైన భూములను అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు బదలాయింపు చేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్టు.. అందుకు ఈ ఓ గా విధులు నిర్వహిస్తున్న వారు సంతకాలు చేయాల్సి రావడం వల్ల భవిష్యత్తులో చిక్కులు తప్పవని స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది.
మాన్సాస్ ట్రస్ట్ కు సంబంధించి ఇప్పటికే అనేక లోపాలను సంచయిత గుర్తించినట్టు.. వాటి వివరాలు రేపో … మాపో బహిర్గతం చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో ఎందుకు పావులుగా మారాలని భయంతో ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. కేవలం గతంలో చేసే అక్రమాలను వెలుగులోకి తీసుకురావడం వల్ల ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారులకు ఇబ్బంది లేకపోయినా…. భూ వ్యవహారాల్లో… పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాల వలన ముందు ముందు చిక్కులు తప్పవు అనే అభిప్రాయానికి రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలకు మాన్సాస్ ట్రస్ట్, సింహాచల దేవస్థానం వేదిక కాబోతోంది.