PV Sindhu Beats Polikarpova – Tokyo Olympics 2020 :
ఒలింపిక్స్ లో ఇండియా సత్తా చాటుతోంది. మీరాబాయి చాను(26) సిల్వర్ మెడల్ సాధించి దేశ ప్రతిష్టను పెంచింది. తాజాగా తెలుగు తేజం సింధు తొలిపోరులోనే శుభారంభం చేసింది. గ్రూప్-జే తొలి మ్యాచ్‌లో వరల్డ్ 58వ ర్యాంకర్ ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై గెలిచింది. వరుస సెట్లలో 21-7, 21-10 తేడాతో సింధు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ కేవలం 28 నిమిషాల వ్యవధిలోనే సింధు ముగించడం విశేషం. తర్వాత మ్యాచ్‌లో సింధు హాంగ్‌కాంగ్‌కు చెందిన చెయుంగ్ గాన్‌తో తలపడనుంది.
చానుకు భారీ నజరానా
టోక్యో వేదికగా జరుగుతున్న ఒలంపిక్స్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తన వీరోచిత ప్రదర్శనతో రజతపతకం సాధించింది. ఆమెకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ భారీ నజరానా ప్రకటించారు. వెయిట్ లిఫ్టింగ్ లో రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినందుకుగాను మీరాబాయి చానుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.1 కోటి అందించనున్నట్టు తెలిపారు. భారీ నజరానాతో పాటు ఉన్నత ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.