ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా హెల్త్ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఏపీలో 6,235 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6 లక్షల 31 వేలు దాటింది. 5,410 మందికి పైగా ఈ వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ సామాన్యుల నుంచి వీఐపీలను ఎవరిని వదలడం లేదు. కర్నూలు, అనంతపురం, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈ వైరస్ మొదట తన ప్రతాపాన్ని చూపింది. ఇప్పుడు ఆయా జిల్లాలో నెమ్మదించినా గోదావరి జిల్లాలో మాత్రం ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. రాష్ట్రంలో ఒకే ఒక ఊరట ఇచ్చే అంశం రికవరీ రేట్ పెరగడం. ఇప్పటివరకు 5,51,821 మంది ఈ వైరస్ మహమ్మారి నుంచి విముక్తులయ్యారు. ఇంకా 74,518 మంది చికిత్స పొందుతున్నారు.
కరోనా సోకిన మరో ఎమ్మెల్యే
రాష్ట్రంలో కరోనా ఉదృతితో పలువురు ప్రజా ప్రతినిధులు ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. గత రెండు రోజులుగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షలలో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. నెగటివ్ వచ్చినా వారు హోం క్వారంటైన్ లో ఉండాలని కోరారు. కరోనాకు చికిత్స తీసుకుంటున్న కారణంగా తనను కలవడానికి ప్రయత్నించవద్దని విజ్ఞప్తి చేశారు. పరామర్శించేందుకు కూడా ఫోన్ చేయవద్దని కోరారు. ప్రజల దీవెనలు, భగవంతుని ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.











