కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించడం వివేకం కాదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మొదటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించగానే లోకేష్ అందరికంటే ముందే స్పందించారు. ప్రభుత్వం పట్టుదలకు పోకుండా పరీక్షలు రద్దు చేయాలని, లేదంటే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని లోకేష్ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం మొండిగా ముందుకే వెళ్లాలని ప్రయత్నించింది. ప్రభుత్వ అనాలోచిత ప్రయత్నాలను అడ్డుకునేందుకు అవసరం అయితే హైకోర్టును ఆశ్రయిస్తామని లోకేష్ ప్రకటించారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు..
ఇంటర్ విద్యార్ధులు,వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించేందుకు జూమ్‌లో వేలాది మందితో లోకేష్ ప్రత్యక్షంగా మాట్లాడారు. వారి అభిప్రాయాలు సేకరించారు. పరీక్షలు రెండు నెలలు వాయిదా పడినా వచ్చిన ప్రమాదం లేదని, ప్రాణాలు పోతే ఎవరు తేగలరని విద్యార్ధుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధులు డిమాండ్ చేశారు. దీంతో నారా లోకేష్ ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం మరింత ఉధృతం చేశారు. పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని కొందరు అప్పటికే హైకోర్టులో పిల్ వేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ కూడా పరీక్షలు వాయిదా, రద్దు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటీషన్ పరిశీలించిన హైకోర్టు, పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. మే 3వ తేదీన ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. ఇక చేసేది లేక ఏపీ ప్రభుత్వం దిగి వచ్చింది. ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఆదివారం సాయంత్రం ప్రకటించింది.
Must Read ;- పరీక్షలు కాదు.. పిల్లల ప్రాణాలే ముఖ్యం: నారా లోకేశ్

శభాష్ లోకేష్..
లోకేష్‌కు ఇంటర్ విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. తాము చేయలేని పోరాటం తమ పిల్లల కోసం లోకేష్ చేశారని వారు కొనియాడుతున్నారు. కరోనా అదుపులోకి వచ్చాక పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు మానసిక ప్రశాంతతో రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారని, ప్రస్తుత పరిస్థితుల్లో వారు ప్రశాంతంగా పరీక్షలు రాసే వాతావరణం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వ మెడలు వంచి పరీక్షలు వాయిదా పడేలా చేసిన నారా లోకేష్‌ను పలు పార్టీల నేతలు కూడా అభినందిస్తున్నారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు కూడా పరీక్షల వాయిదాపై లోకేష్ పోరాట పఠిమను కొనియాడారు.
పది పరీక్షల సంగతేంటి..?
టీడీపీ నేత లోకేష్, విద్యార్ధుల తల్లిదండ్రుల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చి ఇంటర్ పరీక్షలు వాయిదా వేసింది. మరి పదోతరగతి పరీక్షల సంగతి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తారా లేదా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై కూడా హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదా అనే అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతర పోరాటంతో అడ్డుకుని దిగివచ్చేలా చేయడంలో టీడీపీ నేత లోకేష్ సక్సెస్ అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read ;- ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా











