విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టే విద్య అవసరమా?
ఏపీలో విద్యార్థుల జీవితం కరోనా రక్కసి నోటికి అడుగు దూరంలో ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో కరోనా కేసుల సంఖ్యల క్రమేపి పెరుగుతుండటం సర్వత్ర ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఈ నెల 31 వరకు పొడిగించింది. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఏపీ ప్రభుత్వం కూడా ఈ నెల 31 వరకు పొడిగిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. కానీ నిన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యా సంస్థలను మూసివేసే ప్రసక్తే లేదని, కేసులు విపరీతంగా పెరుగుతున్న అమెరికాలోనే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించలేదని పోల్చి చెప్పడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ మహమ్మరి విసృంఖలుగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి, విద్యనందిచాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ కేసు సంఖ్య క్రమేపి పెరగడంతో పాటు ఓమిక్రాన్ ప్రభావం కూడా రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తున్న వేళా.. ప్రభుత్వ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై విపక్షాల ఫైర్
కరోనా కేసుల పెరుగుతున్న నేపధ్యంలో 12కి పైగా రాష్ట్రాల్లో పాఠశాలలను మూసివేయగా.. మొండి ప్రభుత్వానికి సోయి లేదా అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. పాఠశాలల నిర్వహణపై సీఎం మూర్ఖంగా వ్యవహరిచడం తగదని హితవు పలికారు. మరోవైపు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాలు ఇప్పటికే సెలవులను ప్రకటించాయని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని హితవు పలికారు. మరోవైపు ప్రభుత్వం 9,10 తరగతుల విద్యార్థులకు ఇప్పటికే కోవిడ్ వాక్సిన్ అందించామని ఆందోళన అక్కర్లేదని ప్రభుత్వం చెప్పుకొస్తోంది! విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని, కోవిడ్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెబుతున్నారు.