ఏపీలో ధాన్యం రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. అసలే ఖరీఫ్ వరి పంట కోసే సమయానికి నివర్ తుఫాను విరుచుకుపడి తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం కూడా అరకొర సాయం అందించి చేతులు దులిపేసుకుంది. నివర్ తుఫాను దెబ్బకు పంట దిగుబడి 40 శాతం తగ్గిపోవడంతోపాటు, ధాన్యం కూడా తడసిపోయి రంగు మారింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వచ్చిన పంటను ప్రభుత్వ పౌరసరఫరాల శాఖకు విక్రయించారు. అయితే పంట అమ్ముకుని మూడు నెలలు అవుతున్నా నేటికీ రైతుల ఖాతాలో డబ్బు జమ కాలేదు. దీంతో గోదావరి, కృష్ణా జిల్లా రైతులు ఆందోళనకు దిగుతున్నారు.
కేంద్రమే దిక్కు
రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని ముందుగా మిల్లర్లకు సరఫరా చేస్తారు. వారు మిల్లుఆడించి వాటిని కేంద్ర ప్రభుత్వ గిడ్డంగులకు తరలిస్తారు. ప్రతి నెలా ప్రభుత్వం విడుదల చేసే రేషన్ ఇక్కడ నుంచే సరఫరా చేస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించే ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. మూడు నెలలుగా రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ అధికారులు 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకుగాను రైతులకు రూ.45 కోట్లు చెల్లించాల్సి ఉంది. కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించే పరిస్థితిలో లేకపోవడంతో మూడు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. ధాన్యం అమ్ముకున్నా రైతు ఖాతాలో నగదు జమ కాలేదు. దీంతో రబీ సాగు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని కర్షకులు వాపోతున్నారు.
అప్పుల్లో పౌరసరఫరాల కార్పొరేషన్
ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ నిండా అప్పుల్లో మునిగిపోయింది. 2018 చివరి నాటికి రూ.10 వేల కోట్లు ఉన్న పౌరసరఫరాల కార్పొరేషన్ అప్పు, గడచిన 19 నెలల కాలంలోనే రూ.27 వేల కోట్లకు చేరింది. ఇక అదనంగా కార్పొరేషన్ కు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడంలేదు. దీంతో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలు చెల్లించే పరిస్థితి కూడా కార్పొరేషన్ కు లేకుండా పోయింది. పౌరసరఫరాల కార్పొరేషన్ ను అడ్డు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసి నవరత్నాలకు తరలించిందనే ఆరోపణలు వస్తున్నాయి. అందువల్లే పౌరసరఫరాల కార్పొరేషన్ ఇంత పెద్ద మొత్తంలో అప్పుల్లో మునిగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రిని కలసిన బుగ్గన
ధాన్యం రైతుల బకాయిలు విడుదల చేయాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఢిల్లీలో కలసి విజ్ఙప్తి చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తం రైతులకు చెల్లించేందుకు సరిపోకపోవడంతో పాత బకాయిలు అంటే నవంబరులో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ముందుగా డబ్బు చెల్లించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతులు ఇప్పటికే ప్రభుత్వానికి ధాన్యం అమ్మి మూడు నెలలు కావస్తున్నా డబ్బు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2020 బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు
2020 ఖరీఫ్ సీజన్లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు రూ.800 కోట్లు పేరుకుపోయాయి. ఏడాది గడుస్తున్నా రైతులకు ఇంత వరకు నగదు చెల్లించకపోవడంతో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. అయినా ప్రభుత్వంగాని, అధికారుల నుంచి గాని ఎలాంటి హామీ లభించలేదు. ధాన్యం కొనుగోలు చేసిన 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించినా, క్షేత్ర స్థాయిలో మాత్రం హామీ నెరవేరడం లేదని రైతులు వాపోతున్నారు.











