పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం బీజేపీ కూటమి అధికారంలో ఉన్న తమిళనాడు చేజారుతుందని సర్వేలు చెబుతున్న విషయం తెలిసిందే. ఆ సర్వేలను బీజేపీ ఎంతవరకు విశ్వసించిందనే విషయం పక్కన బెడితే.. బీజేపీ తన వ్యూహంలో మార్పులు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు, తమ కూటమిలోని AIADMKకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉన్న చిన్నమ్మ శశికళ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
శశికళ ఈ నెల 27న విడుదల
జయలలిత ఆప్త మిత్రురాలు, తమిళనాట చిన్నమ్మగా పిలిచే వివేకానంద్ కృష్ణవేణి శశికళ అలియాస్ శశికళ అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నారు. ఆమె ఈ నెల 27న విడుదల కానున్నారు. జయలలిత చనిపోయాక శశికళ AIADMK అధినేత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సీఎం కావాలని ఆశించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమె జైలుకి వెళ్లాల్సి వచ్చింది. నాలుగేళ్ల తరువాత విడుదల అవుతున్నారు. తరువాత జరిగిన పరిణామాలు, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తన మేనల్లుడు దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర ఖజగం పార్టీని పెట్టారు. ఈ పార్టీయే ఇప్పుడు బీజేపీకి మింగుడు పడని అంశంగా మారింది. రాష్ట్రంలోనూ శశికళకు అభిమానులున్నారు. AIADMKలోనూ ఆమె వర్గం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె బయటకు రావడం, ఇప్పటికే ఆమెపై సానుభూతి ఉండడం, ఆ సానుభూతి తగ్గకముందే అంటే..రెండు నెలల్లోనే ఎన్నికలు ఉండడం. అంతేగాక.. తన మేనల్లుడి పార్టీ సారధ్య బాధ్యతలు ఆమె తీసుకుంటే..కచ్చితంగా AIADMKపైనా, బీజేపీపైనా విమర్శలు చేయడం కచ్చితం అనే విశ్లేషణలు వస్తున్న తరణంలో తమ కూటమి ఓట్లు చీలతాయని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది.
తమిళనాడులో బీజేపీ విధానాల ప్రభావం అంతంతే..
తమిళనాడులో బీజేపీ సైద్ధాంతికంగా నమ్ముకున్న హిందూత్వ, మేకిన్ ఇండియా లాంటి నినాదాల ప్రభావం కంటే తమిళ సెంటిమెంట్, జయలలిత పేరు, శశికళపై సానుభూతి లాంటి అంశాలే ఎక్కువగా ప్రభావం చూపుతాయి. గతంలోనూ ఇదే జరిగింది. అందుకే జాతీయ స్థాయి పార్టీలు కూడా అక్కడ ద్వితీయశ్రేణి పార్టీలుగానే ఉండాల్సిన పరిస్థితి దశాబ్దాలుగా వస్తోంది. ఈ పరిస్థితుల్లో జరగనున్న నష్టాన్ని నివారించుకునేందుకు బీజేపీ కొన్ని అప్రకటిత రాయభారాలకు తెరలేపిందని చెబుతున్నారు. రెండు రోజులుగా దినకరన్‌తో బీజేపీలోని నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు అక్కడ వార్తలు వస్తున్నాయి.
హామీలు.. సంకేతాలు..
తమిళనాడులో రాజకీయ దిగ్గజాలైన మాజీ ముఖ్యమంత్రులు జయలలిత , కరుణానిధి మరణించడంతో రాష్ట్రంలో రాజకీయంగా కొంత స్తబ్దత ఏర్పడింది. ఆ స్థాయి ఇమేజ్ ఉన్న లీడర్ లేరని చెప్పవచ్చు. 2016లో బీజేపీ అండతోAIADMK అధికారంలో ఉంది. ఇక ఎప్పటి నుంచో డీఎంకే, కాంగ్రెస్ కూటమిగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో స్టాలిన్ ఒక్కరే అక్కడ కీలక నేతగా ఉన్నారు. AIADMKలో పన్నీరు సెల్వం లేదా ప్రస్తుత సీఎం పళనిస్వామి ఉన్నా.. స్టాలిన్‌ను ఎదుర్కోవాలంటే.. బిగ్ షాట్ ఉంటాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శశికళకు ఆ స్థాయి ఇమేజ్ ఉందని, ఒంటరిగా పోటీ చేస్తే అంతా నష్టపోతామని, కలిసొస్తే ‘పెద్ద’పదవి దక్కుతుందన్న హామీ ఇవ్వడమే అజెండాగా దినకరన్‌తో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద శశికళ మళ్లీ రాజకీయంగా కీలకంగా మారతారా అనేది నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది అమ్మ మక్కల్ మున్నేట్ర ఖజగం పార్టీని ఒంటరిగా పోటీ చేయించి AIADMK, BJPలను ఓడించడం, రెండోది సైద్ధాంతికంగా వ్యతిరేకమైనా సరే.. DMKకూటమితో కలవడం, మూడోది AIADMK, bjp కూటమితో కలసి రావడం, నాలుగోది తమిళనాడులో ఓటర్లు ముప్పై ఏళ్ల తరువాత 2016లో వరుసగా రెండోసారి ఒకేపార్టీని (AIADMK) గెలిపించారు. రానున్న ఎన్నికల్లో మరోసారి అంటే వరుసగా మూడోసారి గెలిపిస్తారా అనే అంశంకూడా చర్చకు వస్తోంది. ఈ అంశాల్లో మూడో అంశమే శశికళ మళ్లీ పూర్వవైభవం పొందేందుకు దగ్గరదారి అవుతుందనే అంచనాలున్నాయి.
వ్యతిరేకతపై ఒత్తిడి..
ఇక శశికళ మళ్లీ AIADMKలో చేరేందుకు తాము ఒప్పుకునేది లేదని సీఎం పళనిస్వామి మంగళవారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. శశికళ మళ్లీ AIADMKలో చేరేందుకు సరే నంటే.. పళనిస్వామిని ఒప్పించడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే..బీజేపీ ముందస్తుగా కొందరు నాయకులను చర్చలకు పంపించినట్లు తెలుస్తోంది.