సినీరచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య విజయలక్ష్మి(74) శుక్రవారం ఉదయం మరణించారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెపోటుతో ఆమె మృతిచెందినట్లు కుుటుంబసభ్యులు తెలిపారు. వీరికి ముగ్గురు సంతానం. ఓ కుమారుడు రఘుబాబు బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. రఘుబాబు స్మారకంగానే పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తును ఏర్పాటుచేసి క్రమం తప్పకుండా నాటిక పోటీలు నిర్వహిస్తుంటారు. పరుచూరి రఘుబాబు ప్రేమ ఖైదీ చిత్రానికి కథానాయకుడిగా చేయాల్సి ఉంది. అంతకుముందు నాటకాలపై ఉన్న ఆసక్తితో ఓ నాటకం వేసి, ఆ తర్వాత సినిమా చేయాలనుకున్నాడు. కానీ నాటకం వేసే ప్రాంగణంలోనే అతను బ్లడ్ కేన్సర్‌తో చనిపోయాడు. అతని కోరిక మేరకు ఈ నాటకోత్సవాలు జరుపుతున్నారు. అందులో భాగంగా పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు ద్వారా ఏటా నాటక పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేస్తున్నారు.ఈ దంపతులకు రవీంద్రనాథ్ అనే ఇంకో కుమారుడు ఉన్నాడు. మరణవార్త తెలిసిన వెంటనే తెలుగు సినీ ప్రముఖులంతా పరుచూరి వెంకటేశ్వరరావుకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు చిరజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సహా పలువురు అగ్ర కథానాయకులందరి సినిమాలకూ పరుచూరి బ్రదర్స్(పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ) రచయతలుగా పని చేశారు. ఇటీవల చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి కూడా వీరు పనిచేశారు. విషయం తెలిసిన వెంటనే ఆయన సోదరుడు పరుచూరి గోపాలకృష్ణ తన అన్నయ్య వెంకటేశ్వరరావు ఇంటికి చేరుకుని సోదరుడిని ఓదార్చారు. తన వదినను చూస్తుంటే తనకు తన తల్లి గుర్తొస్తుంటుందని ఆయన అనేక సందర్భాలలో అనేవారు.
వెంకటేశ్వరరావుకు చిరంజీవి పరామర్శ
విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పరుచూరి వెంకటేశ్వరరావు తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు.
పచ్చళ్లు పట్టడంలో దిట్ట
పరుచూరి వెంకటేశ్వరరావు కుటుంబానిది కృష్ణా జిల్లా. వీరిది విజయవాడ సమీపంలోని ఓ పల్లెటూరు. విజయలక్ష్మితో ఆయనది పెద్దలు కుదిర్చిన వివాహమే. వెంకటేశ్వరరావు ఏజీ ఆఫీసులో ఉద్యోగం చేసేవారు. ఆయన స్వతహాగా నాటక రచయిత. ఆయన భార్య విజయలక్ష్మి గృహిణి. పరుచూరి కుటుంబానికి వంటలు చేయడంలో మంచి పేరుంది. ముఖ్యంగా పరుచూరి బ్రదర్స్ తల్లి హైమావతమ్మకు ఊరగాయ పచ్చళ్లు పట్టడంలో దిట్ట. ఈనాడు రామోజీరావు ప్రియా పచ్చళ్ల కంపెనీ పెట్టేటప్పుడు హైమావతమ్మ సలహాలు సంప్రదింపులు తీసుకున్నారట. ఆ హైమావతమ్మ చేసే వంటలు, పచ్చళ్లు పట్టడం లాంటివన్నీ విజయలక్ష్మి కూడా నేర్చుకున్నారట. స్వర్గీయ నందమూరి తారకరామారావు లాంటి వారు కూడా పరుచూరి కుటుంబం నుంచి వచ్చే పచ్చళ్ల రుచులు చూసి ఆస్వాదించేవారట. ఆ రుచుల మహిమో ఏమోగాని ఎన్టీఆర్ ఈ సోదరులను సినిమా రంగంలో బాగా ప్రోత్సహించారు.










