గ్రేటర్ ఎన్నికల వేడి ఇప్పటికే రాజకీయ పార్టీలకు ఎక్కేసింది. త్వరలో జరిగే ఎన్నికల్లో ఓటర్ల మైండ్ సెట్ ఎలా ఉందన్న విషయం మీద తాము ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించినట్లుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పటం తెలిసిందే. వందకు పైగా సీట్లను గెలుచుకోవటం ఖాయమన్న ధీమాను ప్రదర్శించారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తో పాటు.. ఇతర టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే.. ఇప్పటివరకు తెలంగాణ రాజకీయ ఆటలో భాగం కాని పవన్ కల్యాణ్.. ఆకస్మాత్తుగా తన ఉనికిని చాటే ప్రకటనను విడుదల చేసిన కొత్త చర్చకు తెర తీశారు.
ఇప్పటివరకు తెలుగు రాజకీయాల్లో ఆటలో అరటిపండుగా పలువురు పవన్ కల్యాణ్ ను అభివర్ణిస్తారు. అలాంటి ఆలోచన ఏ మాత్రం సరికాదన్న మాట జనసేన విడుదల చేసిన ప్రకటన చూస్తే ఇట్టే అర్థమవుతుంది. గ్రేటర్ పరిధిలోని 50 డివిజన్లలో నాయకత్వాలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించిన జనసేన.. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో తాము బరిలోకి దిగుతామన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.
ఏపీలోనే ఏమీ పీకలేని పవన్.. తెలంగాణలో.. అందునా గ్రేటర్ లో ఏం చేస్తారంటూ గులాబీ నేతలు కొందరు ఎక్కెసాలు ఆడుతున్నారు. అయితే.. వారుమర్చిపోతున్న విషయం.. ఏపీలో పవన్ గెలవలేదు. కానీ.. జగన్ భారీ మెజార్టీతో గెలిచేందుకు ఆయనే కారణమయ్యారన్నది మర్చిపోకూడదు. గ్రేటర్ విషయానికి వస్తే.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీ.. సరైన హ్యాండ్ కోసం వెతుకుతోంది. పవన్ తో తమకున్న మిత్రత్వాన్ని గ్రేటర్ ఎన్నికల్లో ఉపయోగిస్తే..చక్కటి ఫలితాలు వస్తాయన్న భావనలో ఉన్నారు.
సీమాంధ్రకు చెందిన ఓటర్లు గ్రేటర్ లోని కొన్ని డివిజన్లలో భారీగా ఉంటారన్నది మర్చిపోకూడదు. దీనికి తోడు ఉత్తరాదికి చెందిన వారు బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉంటారు. ఇక.. పవన్ పుణ్యమా అని సీమాంధ్రులు బీజేపీకి మరింత దగ్గరయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇరు పార్టీలు భాగస్వామ్యంతో గ్రేటర్ ఎన్నికల్లో నిలిస్తే.. టీఆర్ఎస్ అధినేత చెబుతున్నట్లుగా వంద ప్లస్ సీట్లు రావటం సాధ్యం కాదని చెబుతున్నారు. పవన్ ఒక్కడిగా ప్రభావం చూపలేడు కానీ.. బీజేపీతో కలవటం ద్వారా టైట్ పోటీని ఇవ్వటమే కాదు.. కొన్నిచోట్ల షాకులు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. గులాబీ అధినేత చేయించిన సర్వేలన్ని జనసేనను లెక్కలోకి తీసుకోకుండా చేసినవన్న మాట వినిపిస్తోంది. అదే నిజమైతే.. కేసీఆర్ లెక్కలు చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్లే. అదే సమయంలో.. పవన్ ఆటలో అరటిపండు ఎంత మాత్రం కాదన్నది కూడా ఫ్రూవ్ అవుతుందని చెప్పక తప్పదు.