ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు పరస్తున్న పలు సంక్షేమ పథకాలు ఎంత వరకు అర్హులకు చేరుతున్నాయో తెలియదుగానీ… త్వరలో ప్రారంభం కానున్న జగనన్న విద్యాకానుక మాత్రం ఖచ్చితంగానూటికి నూరుపాళ్లూ లబ్ది దారులకు చేరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇందులో లబ్దిదారులు చాలావరకు విద్యార్ధులు మాత్రమే… కాబట్టి ఎలాంటి అవకతవకలకు పాల్పడడానికి ఆస్కారం లేదు. సర్కారు బడికి వచ్చేవారు చాలావరకు పేద విద్యార్ధులు మాత్రమే. అలాంటి వారికి ఈ విద్యాకానుక చాలా వరకు మేలు చేస్తుంది. ఈ కానుక కింద ప్రాథమిక పాఠశాల విద్యార్ధులకు పుస్తకాల బ్యాగ్ తోబాటు, పాఠ్యపుస్తకాలు, మూడు జతల యూనిఫామ్స్, వర్క్ బుక్ కం నోట్ బుక్స్, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, టై, ఐ.డి.కార్డు, బెల్టు వంటి వాటిని అందజేయనున్నారు.
ఇంతవరకూ బాగానే ఉన్నా… ఈ కార్యక్రమం ఎంత వరకు ప్రజలకు మేలు చేస్తుంది అన్న విషయానికి వస్తే… పేద విద్యార్దులకు అవసరమైనన్ని నోట్ బుక్స్ కొనివ్వడానికి కూడా విద్యార్ధుల తల్లిదండ్రుల వద్ద తగినంత ఆర్ధిక స్తోమత ఉండేది కాదు. దీంతో వారికి తగినన్ని నోట్ బుక్స్ ఉండేవి కావు. తదనుగుణంగా వారు అభ్యసనలో వెనుకబడడం సహజంగా జరుగుతుంటుంది. అలాంటి పరిస్థితికి చెక్ పెడుతూ జగన్ ఈ పథకాన్నిప్రవేశపెట్టనున్నారు. దీంతో తల్లిదండ్రులకు చాలా వరకు తమ పిల్లల విద్యకొరకు చేయవలసిన ఖర్చు చాలా వరకు తగ్గించినట్లయింది.
దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్ధుల విద్యాభ్యాసం కొనసాగుతుంటుంది. ఇది నిజంగా చాలా మంచి పథకంగా చెప్పవచ్చు. అయితే విభజన అనంతరం ఆర్ధికంగా అంతగా పరిపుష్టంగా లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం విద్య విషయంలో ఇంతగా ఖర్చుకు వెనుకాడకుండా ముందడుగు వేయడం చూస్తే నిజంగా హర్షించదగిన విషయమేనని చెప్పవచ్చు.
ఏ రాష్ట్రమైనా విద్యపై పెట్టుబడికి వెనుకాడకుండా ఉండాలి. ఎలాంటి రంగాలలోనైనా పెట్టుబడి పెట్టిన కొద్దికాలానికే దాని ఫలితాలను అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. కానీ విద్యపై పెట్టుబడి అనేది దీర్ఘకాలిక పెట్టుబడిగా చెప్పవచ్చు. కాబట్టి కొన్ని రాష్ట్రాలు విద్యపై పెట్టుబడకి కాస్తవెనుకాడతాయనడంలో సందేహం లేదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్కరాష్ట్రమే అయిన తెలంగాణను తీసుకుంటే అది సహజంగా విభజనకు ముందే విద్య విషయంలో చాలా వెనుకబడిన ప్రాంతంగా చెప్పవచ్చు.
ఈ కారణంగానే తెలంగాణ ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయనే విషయం పలువురు మేధావులు ఘంటాపథంగా చెప్పడంకూడా జరిగింది. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తరువాత అన్ని విషయాల్లోనూ తెలంగాణను ముందుకు తీసుకువెళతాం అంటూ వాగ్దానాలు చేసిన ప్రభుత్వం మాత్రం అన్ని రంగాలను గురించి పక్కనబెడితే అతిముఖ్యమైన విద్యారంగాన్ని మాత్రం చాలా చిన్నచూపు చూస్తోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే మాత్రం తెలంగాణ విద్యవిషయంలో చేస్తున్న అభివృద్ధి ఏదో తూతూ మంత్రంగా ఉందని చెప్పవచ్చు.
అక్షరాస్యత విషయంలో చాలా వెనుక బడిన ప్రాంతంగా ఉన్న తెలంగాణ ఆ విషయంగా ముందడుగు వేయాలంటే ఎంతటి ప్రయత్నంచేయాల్సి ఉంటుందో… కాస్త ఆలోచించాలి. ముఖ్యంగా సర్కారు బడులను బలోపేతం చేయడానికి మరింతగా కృషి చేయాల్సి ఉంటుంది. సర్కారు బడులలో చేరేది పేద ప్రజలకు చెందిన పిల్లలే. వారు ఆర్థికంగా వెనుకబడిన వర్గం అని చెప్పకతప్పదు. అలాంటి వారి పిల్లలు నోట్ బుక్స్ కొనమని ఉపాధ్యాయులు చెప్పగానే వెంటనే పాఠశాలకు డుమ్మా కొట్టడం పరిపాటి. అలా కొద్దిరోజులకు డ్రాపవుట్లు సంఖ్య పెరిగిపోతుండడం కూడాసహజం. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు బడులను బలోపేతంచేయడానికి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది… కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది… అందునా ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత పాఠశాలలు నడవకపోవడం మూలంగా సర్కారు బడి విద్యార్ధులకు మరింతగా నష్టం వాటిల్లడం అనేది ఖాయం.
ఈ నష్టాన్నిభర్తీ చేయడానికి ఏదో ఆన్ లైన్ క్లాసులరూపంలో డి.డి ఛానెల్స్ లోకొన్ని పాఠ్యాంశాలను ప్రసారం చేసి చేతులు దులుపుకుంటోంది. మరి విద్యార్ధులు వాటిని ఎంతవరకు వింటున్నారు… వాటిని ఏమాత్రంఅర్థం చేసుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడం ఉపాధ్యాయులకు మరో పరీక్ష లాగా ఉంది. ఇందుకోసం తల్లిదండ్రులకు ఫోన్లు చేయడం… లాంటి తతంగాల వల్ల వారినుంచి కొండొకచో చీవాట్లు తినడం కూడా ఉపాద్యాయులవంతుగా ఉంది. ఇలాంటినేపధ్యంలో ఉపాద్యాయులు తాము కరోనా బారిన పడినా ఫరవాలేదు… పాఠశాలలు నడవడమే మేలని భావిస్తున్నారు.
మరోవైపు విద్యార్ధులకు కేవలం పాఠ్యపుస్తకాలను మాత్రమ అందజేసిన తెలంగాణ సర్కారు యూనిఫామ్స్ అంతజేతలోఇంకా వెనుకబడే ఉంది. అసలు నడవని పాఠశాలకు యూనిఫామ్స్ ఎందుకని భావించిందో ఏమో… అందుకే అక్టోబరు నెల వస్తున్నా యూనిఫామ్స్ విషయం గురించి పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆంధ్ర సర్కారు మాత్రం పాఠశాలలునడుస్తున్నాయా లేదా అనే విషయాన్నిపక్కనబెడితే… తాను చేయాల్సిన పని మాత్రం ఎంతో సమర్ధవంతంగా చేస్తోందనే చెప్పాలి.
ఇలాంటి పథకాల వల్ల సర్కారు పాఠశాలలు మరింతగా బలోపేతం కావడమే కాదు… అందులోని విద్యాప్రమాణాలు కూడా మెరుగుపడతాయని ఖచ్చితంగాచెప్పవచ్చు. తత్ఫలితంగా రానున్నరోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరింతగా అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తుంది.











