రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీకి సంబంధించి లెక్క తేల్చేందుకు కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ హాట్ గా చర్చలు జరిగినట్లు.. వాదనలు చోటు చేసుకున్నట్లు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. అందుకు భిన్నంగా ఇద్దరు సీఎంలకు చెందిన మీడియా సంస్థలు వేర్వేరుగా రిపోర్టు చేయటం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ భేటీలో తామే విజయం సాధించినట్లుగా గులాబీ దళానికి చెందిన మీడియా రిపోర్టు చేసింది.
ఇక.. జగన్ మీడియా సంస్థ మాత్రం దూకుడు ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించింది. అదే సమయంలో సీఎం జగన్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకున్నట్లుగా కనిపించింది. అయితే.. ఈ ఇద్దరి కంటే మాస్టర్ మైండ్ కేంద్రానిదిగా చెప్పొచ్చు. నీటి పంచాయితీ కోసం తమ వద్దకు వచ్చిన వారి జుట్టు తమ చేతుల్లో పెట్టుకునేలా కథ నడిపించారు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్. భేటీ తర్వాత కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు.
రెండు రాష్ట్రాలు కోరుకుంటే గోదావరి మీద ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని గజేంద్ర సింగ్ ఆఫర్ చేస్తే.. ఆవేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకే చెప్పటమే కాదు.. అందుకు అవసరమైన లేఖను ఇస్తామని ఆయన మాట ఇచ్చేశారు. ఇదే విషయాన్ని కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తావించటం గమనార్హం. భేటీలో తొందరపడి ఓకే అన్న కేసీఆర్.. తీరా సమావేశమయ్యాక జరుపుకున్న అంతర్గత సమీక్షలో.. తాను తొందరపడినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది.
ట్రైబ్యునల్ కు ఓకే అని చెబితే.. తెలంగాణకే నష్టమన్న విషయాన్ని ఆయన సలహాదారుల టీం చెప్పటంతో కేసీఆర్ అలెర్టు అయినట్లు చెబుతున్నారు. ట్రైబ్యునల్ ఏర్పాటుతోనే కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తే.. కొత్త సమస్యలు తెర మీదకు వస్తాయన్న విషయాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్.. తాను చెప్పినట్లుగా బుధవారం నాడే లేఖ పంపిస్తానన్న మాట మీద మళ్లీ మాట్లాడకుండా మౌనాన్ని ఆశ్రయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
తెలివి ఒక్కడి సొత్తు కాదన్న విషయాన్ని కేంద్రం తన చర్యలతో చెప్పకనే చెప్పటంతో.. తెలంగాణ ప్రభుత్వం కౌన్సిల్ భేటీలో తాను చెప్పిన మాటల మీద మరిక ముందుకు వెళ్లకూడదన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరి ట్రైబ్యునల్.. డీపీఆర్ లు కేంద్రానికి ఇవ్వటం లాంటి వాటితో లాభం కంటే నష్టమే ఎక్కువన్న ఆలోచనకు వస్తున్నట్లు చెబుతున్నారు. చాలా తక్కువగా తప్పులు చేసే కేసీఆర్.. తాజా భేటీలో మితిమీరిన ఆత్మవిశ్వాసం కేసీఆర్ ను దూకుడుగా వ్యవహరించేలా చేయటమే కాదు.. కేంద్రాన్ని తక్కువగా అంచనా వేసిన విషయాన్ని ఆయన గుర్తించినట్లుగా సమాచారం.











