టీడీపీ-జనసేన పొత్తు విషయంలో పార్టీ క్యాడర్‌కు పవన్ కల్యాణ్ ఓ వార్నింగ్ ఇచ్చారు. ఎవ్వరూ కూడా పొత్తు గురించి తప్పుగా మాట్లాడకూడదని స్పష్టం చేశారు. తాను ఆదేశించినప్పటికీ ఎవరైనా పొత్తు గురించి తప్పుడుగా మాట్లాడితే వారిని వైఎస్ఆర్ సీపీ కోవర్టుగా పరిగణించాలని పార్టీ నేతలకి సూచించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ విషయం తేల్చి చెప్పేశారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి తమతో ఉన్నవారు అందరూ తమ నిర్ణయాలను గౌరవిస్తున్నారని, బయటివారు మాత్రమే ఇలా పొత్తు గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. వాళ్లు జనసేన నేతలమే అంటూ చెప్పుకుంటూ ఇతర పార్టీలకి లబ్ధి చేకూరేలా అబద్ధపు ప్రచారాలు మొదలు పెట్టారని, వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జనసేన టీడీపీ వెనుక నడవడం లేదని.. ఆ పార్టీతో కలిసి నడుస్తుందని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.
ఆంధ్రాలో టీడీపీతో, తెలంగాణలో బీజేపీతో జనసేన కలిసి పోటీ చేయడంపై వైఎస్ఆర్ సీపీ తీవ్ర విమర్శలు చేస్తోందని పవన్ కల్యాణ్ చెప్పారు. చేస్తోందని తాను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటానని పవన్ చెప్పారు. దీని వెనుక పార్టీ వ్యూహాలు ఉంటాయని, జరగబోయే పరిణామాలను కూడా అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అసలు జనసేన పార్టీ పొత్తుల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ సీపీకి లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో బీజేపీతో, ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామంటే అది ప్రజల మంచిని ఉద్దేశించి మాత్రమే అని, పార్టీ ప్రయోజనాల కోసం కాదని పవన్ చెప్పారు. ఏపీలో వైఎస్ఆర్ సీపీని సమర్థంగా ఎదుర్కోవడం కోసమే.. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఏపీలో జనసేనకు నేడు ఆరున్నర లక్షల మంది కేడర్ బలం ఉందని పవన్ చెప్పారు. అభిమానులు మరింత మంది ఉన్నారని.. ఇంతమంది బలం ఉందని గర్వం రాకూడదని అన్నారు. జనసేన విధానాలు నచ్చి పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. తనను తన భావజాలాన్ని నమ్మే యువత తమ వెంట వస్తున్నారని చెప్పారు. జనసేనకు యువతే పెద్ద బలమని.. మన పార్టీకి ఉన్న యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారని గుర్తు చేశారు. అయితే, పార్టీ నుంచి వెళ్లిపోతామని తమను అనేక మంది బెదిరించారని.. ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని వారికి తేల్చి చెప్పానని అన్నారు. స్వార్థం వదిలేయాలని నాయకులను కోరుతున్నానని చెప్పారు. కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే మన పార్టీకి ఢిల్లీలో కూడా గుర్తింపు వచ్చిందని అన్నారు.











