ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారా? చంద్రబాబు అరెస్టు కావడానికి ముందే వీరు ఇద్దరూ కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మాజీ టీఆర్ఎస్ నేత, ఉద్యమకారుడైన గాదె ఇన్నారెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చంద్రబాబు అరెస్టుకు ముందు అంటే సెప్టెంబరులో జగన్ – కేటీఆర్ భేటీ అయినట్లుగా మీడియాలో ఎక్కడా రాకపోయినప్పటికీ, రహస్యంగా వీరి సమావేశం జరిగిందని గాదె ఇన్నారెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో బంజారాహిల్స్ సమీపంలో ఉండే సాగర్ సొసైటీ ప్రాంతంలో ఓ ఇంట్లో కేటీఆర్ – జగన్ కలిసి మాట్లాడుకున్నట్లుగా ఇన్నారెడ్డి చెప్పారు.
తెలంగాణ ఎన్నికల తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై ఇన్నారెడ్డి తన అభిప్రాయాన్ని చెబుతూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ – జగన్ కలిశారని, కలిసి మాట్లాడుకున్నారని చెప్పడం ఆసక్తిని కలిగించింది. దీన్ని బట్టి, చంద్రబాబు అరెస్టుకు ముందే వీరి భేటీ జరిగిందంటే.. ఆ అరెస్టు చేయబోయే విషయం కూడా ముందుగానే జగన్ కేటీఆర్ తో పంచుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ రహస్య కీలక సమావేశంలో కచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి, అలాగే చివరి నిమిషంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకత ఎదురవుతుంటే.. ఏపీ నుంచి తమవంతుగా అందించే సాయంపై కూడా మాట్లాడుకున్నారని ఇన్నారెడ్డి వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోంది. అందులో భాగంగానే మొన్న పోలింగ్ రోజు జరిగిన నాగార్జున సాగర్ టెన్షన్ డ్రామాకు కూడా అప్పుడే బీజం పడినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ విషయాన్ని చెప్పిన గాదె ఇన్నారెడ్డి అప్పట్లో టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా చెప్తారు. కేసీఆర్‌తో ఏర్పడిన విభేదాలతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇన్నారెడ్డి.. తెలంగాణ రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేసి ఉద్యమం కొనసాగించారు. ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్లారు. అంతకు పూర్వం నక్సలైట్ గానూ పని చేశారు. విద్యార్థి దశలోనే రాడికల్ విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించారు. పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరి.. ఉద్యమం నుంచి బయటకు వచ్చి.. కేసీఆర్‌తో కలిసి హైదరాబాద్‌లోని జలదృశ్యం కార్యాలయంలో పలుమార్లు సమావేశాల్లో పాల్గొనేవారు. అలా ఇద్దరూ ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.











