పాయల్ ఘోష్… మంచు మనోజ్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఊసరవెల్లిలో మెరిసింది. సినిమాలో అవకాశాల కోసం వెళ్తే ఓ బాలీవుడ్ డైరెక్టర్ తనను వేధించాడని, గదిలోకి తీసుకెళ్లి బ్లూ ఫిలిమ్ చూపించాడని ఆ దర్శకుడు ఎవరోకాదు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అంటూ బాంబు పేల్చింది పాయల్. మహిళల సాధికారిత అంశంపై సినిమాలు తీసే అనురాగ్ కశ్యప్ వెనక ఇంతటి చీకటి కోణం దాగి ఉందా అనే చర్చ కూడా జరిగింది. కొందరైతే పాయల్ పాపులారిటీ కోసమే ఒక మంచి దర్శకుడిపై ఇలాంటి అభాండాలు వేస్తోందని అన్న వాళ్లూ ఉన్నారు.
అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ ముంబైలోని ఒక పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. అంతేకాకుండా అనురాగ్ కశ్యప్ వలన తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు వై-కేటగిరీ భద్రతను కల్పించమని గవర్నర్ ను అడిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల వెర్సోవా పాలసీ స్టేషన్‌లో కశ్యప్ ను దాదాపు ఎనిమిది గంటలు పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఆయన పాయల్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ, ఆ సమయంలో తాను వేరే దేశంలో ఉన్నట్టు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పాయల్ తన ట్విట్టర్ ద్వారా ‘కశ్యప్ పోలీసుల ముందు అబద్దాలు చెప్పాడు. నిజనిజాలు బయటపడాలంటే కశ్యప్ ని నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని కోరుతున్నాను. ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో నా లాయర్ అప్లికేషన్ ఇవ్వనున్నాడు’ అని తెలిపింది అంతకముందు కశ్యప్ .. పాయల్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ 2013 ఆగస్ట్‌లో షూటింగ్ నిమిత్తం శ్రీలంకకు వెళ్లాను అని చెప్పారు. అందుకు సంబంధించి ఆధారాలు కూడా ఇచ్చారు. పాయల్‌తో నేనెప్పుడు అలా ప్రవర్తించలేదు అని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు.











