ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వ వాదులంతా ఏకమవుతున్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై నానాటికీ పెరుగుతున్న దాడులు, దొంగతనాల నేపథ్యంలో హిందూ వాదులంతా ఏకం కావాలని నిర్ణయించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం కావడం, విజయవాడ కనకదుర్గ ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనలు హిందుత్వ వాదులను కలవర పెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ వంటి హిందుత్వ సంస్థలు ఇప్పటికే నిరసన కార్యక్రమాలు ప్రారంభించాయి. వీటితో పాటు ఇతర పార్టీలలోని హిందూ వాదులు కూడా నిరసనలకు గొంతు కలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఓ మతాన్ని ప్రోత్సహించడంలో భాగంగా హిందూ దేవాలయాలపై కుట్ర పూరితంగా దాడులు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ దాడులను ఎదుర్కొనేందుకు హిందూ వాదులందరూ సంఘటితం కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
“చలో అమలాపురం” స్ఫూర్తిగా
అంతర్వేదిలో రథం దగ్ధం అనంతరం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో నిర్వహించిన “చలో అమలాపురం” కార్యక్రమమే స్ఫూర్తిగా హిందూ వాదులు ఐక్యమవుతున్నారు. రాజమండ్రిలోని ఓ కళ్యాణ మండపంలో హిందూ వాదులు సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న హిందూ వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం చేయాలని తీర్మానించినట్లు చెబుతున్నారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ వాదులందరూ ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో హిందుత్వ శక్తులపైనా, దేవాలయాల పైనా, ఇతర ధార్మిక సంస్థలపైనా దాడులు జరగకుండా చూడడం, దేవాలయ ఆస్తుల పరిరక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని హిందూ వాదులు నిర్ణయించినట్టు చెబుతున్నారు. అయితే రాజకీయ పార్టీలు… ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఇందులో కలగచేసుకోకుండా చూడాలని, వారి ప్రమేయం ఉంటే తమ లక్ష్యం నీరు కారుతుందని ఈ సమావేశంలో పాల్గొన్న హిందుత్వ వాదులు అభిప్రాయపడినట్లు సమాచారం.
త్వరలో కమిటీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల పరిరక్షణ, ఆస్తులను కాపాడడం, దేవాలయ భూములు సంరక్షణ వంటివి చేపట్టేందుకు త్వరలో ఓ కమిటీని నియమించాలని సమావేశంలో తీర్మానించినట్టు చెబుతున్నారు. ఈ కమిటీ రాజకీయాలకు, ఇతర అంశాలకు దూరంగా ఉండాలని, కేవలం దేవాలయాల పరిరక్షణే ధ్యేయం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ దేవాలయ పరిరక్షణ కమిటీలో వివిధ మఠాధిపతులు, ప్రవచనకర్తలు, ధార్మిక సంస్థలకు చెందిన వారు సభ్యులుగా ఉండాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
త్వరలో ఈ కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలను ఖరారు చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. హిందుత్వ వాదులు నిర్వహించిన ఈ సమావేశం వెనుక తెలంగాణకు చెందిన ఓ మఠాధిపతి ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఓ మతానికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని, దానిని అడ్డుకోవాలంటే హిందూ వాదులందరు ఏకతాటిపైకి రావాలని, ఇటీవల ఆ మఠాధిపతిని కలసిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు హిందూ వాదులతో ఆయన అన్నట్లు సమాచారం.










