(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
జిల్లాల పునర్విభజన పేరిట పాలకొండ రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం మూడు ముక్కలుగా విభజిస్తే సహించేది లేదని, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఒకటై మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పెద్దయెత్తున ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేశారు.
పాలకొండను జిల్లా చేయాలి
పాలకొండ రెవెన్యూ డివిజన్‌ను జిల్లా చేయాలని కోరుతూ పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కోటదుర్గమ్మ ఆలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ఆర్టీసి కాంప్లెక్స్ మీదుగా రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
అభివృద్ధికి ఆమడ దూరం
పాలకుల నిర్లక్ష్యంతో పాలకొండ రెవెన్యూ డివిజన్ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోందని సాధన సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ నిర్ణయించిన జిల్లాల విభజనతో డివిజన్‌ను మూడు ముక్కలు చేసి విభజించాలనుకోవడం సరికాదని, దీన్ని ప్రజలు సహించరని ఆందోళనలో పాల్గొన్న నాయకులు ఉద్ఘాటించారు. పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాతపట్నం, రాజాం, పాలకొండ శాసనసభా నియోజకవర్గాలను, పాలకొండ పట్టణానికి అనుసరించి ఉన్న బూర్జ మండలాలను కలుపుతూ పాలకొండను జిల్లాగా రూపొందింది, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కార్యక్రమానికి సాధన సమితి అధ్యక్షులు బుడితి అప్పల నాయుడు, కార్యదర్శి వండాన కూర్మారావు, సంఘం గౌరవ అధ్యక్షులు కణపాక చౌదరి నాయుడు, ముఖ్య సలహాదారులు సామంతుల దామోదర రావు, కర్నేన అప్పలనాయుడు, టంకాల దుర్గారావు, సుంకరి సుధాకర రావు, ఉపాధ్యక్షు తాడంగి సునీత, గంట సంతోష్, గండి రామినాయుడు, సబ్బ నానాజి, కొట్నాన అప్పన్న, జాని , విద్యార్ధి యుజన సంఘం నాయకులు గర్భాపు నరేంద్ర, పొన్నాడ రామ కృష్ణ, పుండరీక్ష, గణపతీశ్వరరావు, నాగేశ్వర రావు తదితరులు నాయకత్వం వహించారు.











