గ్రేటర్ ఎన్నికల్లో పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. తమకు తిరుగేలేదని అధికార పార్టీ చెబుతుంటే తమ బలం పెరిగిందని మరోపార్టీ చెబుతోంది. ఇక తమను ఎవరూ ఢీ కొట్టలేరని మరో నేత చెబుతున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీలు అంచనాల్లో మునిగి తేలుతున్నాయి. ఏ డివిజన్ తమకు అనుకూలం , ఏ డివిజన్ తమకు వ్యతిరేకంగా ఉందన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. పోలింగ్ శాతం తగ్గినా ఎవరికి వారు గ్రేటర్ పీఠం తమదేనన్న ధీమాలో ఉన్నారు.
టీఆర్ఎస్ ధీమా
గ్రేటర్‌లో మరోమారు మేయర్ పీఠం తమదే అంటోందీ టీఆర్ఎస్. ఇప్పటికి హైదరాబాద్ అభివృద్ది తమతోనే సాధ్యం అని ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంలో సక్సెస్ అయ్యామని భావిస్తోంది టీఆర్ఎస్. రోడ్ షోలలో ఇదే అంశాన్ని కేటీఆర్ చెబుతూ వచ్చారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో అనేక పరిశ్రమలు తీసుకు వచ్చామని రానున్న రోజల్లో మరిన్ని కంపెనీలు వచ్చేందుకు ఒప్పందాలు చేసుకున్నామని.. ఈ సమయంలో వేరే పార్టీని గెలిపిస్తే ఆగంఆగం అవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఇతర పార్టీలకు అవకాశం ఇస్తే నగరం పూర్తిగా అల్లకల్లోలం అవుతుందని ప్రజలను ఆలోచింప జేసేలే ప్రసంగాలు చేసుకుంటూ వచ్చారు. దీంతో కేటీఆర్ ప్లాన్ కచ్చితంగా వర్కౌట్ అవుతుందని, కచ్చితంగా డెబ్బైకి పైగా సీట్లు తమకు వస్తాయన్న భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
నూతన ఉత్సాహంతో బీజేపీ
తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల క్షేత్రంలో పోరాటం చేసింది బీజేపీ. ఏకంగా జాతీయ నాయకత్వం కూడా రంగంలోకి దిగి రాష్ట్ర నాయకత్వానికి తమ వంతు సహకారం అందించింది. దీంతో ఎప్పుడూ లేని ఉత్సాహంతో బీజేపీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. టీఆర్ఎస్ కు ధీటుగా సమాధానాలు చెప్పుకుంటూ ప్రచారంలో అన్ని పార్టీలను తమ ట్రాప్‌లో పడేయడంలో సక్సెస్ అయ్యింది. దీంతో పాటు ప్రజలను సైతం తమ వైపు తిప్పుకోవడంలో ఆ పార్టీ అధ్యక్షుడు విజయం సాధించగలిగాడని చర్చ సాగుతోంది. దీంతో ఆ పార్టీకి కనీసం 40 నుంచి 50 వరకు సీట్లు రావచ్చని భావిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో పెద్దగా హడావుడి చేయని కాంగ్రెస్, టీడీపీ లు కూడా పది నుండి 15 సీట్ల వరకు రావచ్చని అంచనా వేసుకుంటున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారన్నది తేలాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.










