(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
లక్షలాది రూపాయలు వెచ్చించి రెండు నెలల క్రితం ఆర్భాటంగా చేపట్టిన జగనన్న పచ్చతోరణం శ్రీకాకుళం జిల్లాలో మోడు వారింది. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం, అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణా లోపం వల్ల ఈ పరిస్థితి దాపురించినట్లు తెలుస్తోంది.
లబ్ధిదారులకు అందకముందే ..
పేదలకు అందించేందుకు ప్రభుత్వం గుర్తించిన స్థలాలను నందనవనంగా తీర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలల కిందట పెద్దఎత్తున జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో వీటిలో మొక్కలు నాటారు. ఆ తరువాత వీటిని గాలికి వదిలేయడంతో ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు అందించక ముందే ఆ మొక్కలు కనుమరుగయ్యాయి.
జిల్లాలో 39వేల మొక్కలు
శ్రీకాకుళం జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల్లో 39వేల మొక్కలు నాటారు. పట్టణ, గ్రామీణ పరిధిలో 917 స్థలాల పరిధిలో 98 కి.మీ. మేర మొక్కలు నాటారు. ఒక్కో మొక్క నాటేందుకు రూ.62 చొప్పున మొత్తం రూ.24.18 లక్షలు వ్యయం చేశారు. నిర్వహణ నిధులు ఇందుకు అదనంగా వెచ్చించారు. నాటిన మొక్కల్లో ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం 85 శాతం మొక్కలు మాత్రమే మిగిలి ఉన్నట్లు చెబుతున్నారు. ఆ లెక్క ప్రకారం ప్రస్తుతం 31,500 మొక్కలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 7,500 మొక్కలు చనిపోయాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం, శివారు ప్రాంతాలు కావడం, నీటి సదుపాయం లేకపోవడం వల్ల మొక్కలు కనుమరుగయ్యాయి. పక్కాగా నిర్వహించి ఉంటే ఇప్పటికే స్థలాలు వద్ద పచ్చదనం కనిపించేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మళ్లీ నాటుతాం ..
ఇళ్ల స్థలాలు వద్ద మొక్కలు చనిపోతే మళ్లీ నాటుతామని, ఉపాధి హామీ పథకంలో అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతుండటం హాస్యాస్పదంగా ఉంటోంది. నాటిన మొక్కలను సంరక్షించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షణ పెంచేలా ఆదేశాలు జారీ చేస్తే ఉపయోగం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.











