ఎప్పుడో జరిగిన కథను .. అప్పటి వాతావరణంలోనే తెరకెక్కించి.. ఇప్పటి జెనరేషన్ కు అందించడం ఇటీవలి కాలంలో ఎక్కువవుతోంది. ఇలాంటి సినిమాల్ని పీరియాడికల్ మూవీస్ అంటారన్న సంగతి తెలిసిందే. పూర్వం దీన్నే ఫ్లాష్ బ్యాక్ లో చెప్పేవారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఆ కాలంలోకే వెళ్లి ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తున్నారు పలువురు దర్శకులు. గతంలో ఈ తరహాలో కొన్ని సినిమాలు వచ్చాయి. అలాగే.. లాక్ డౌన్ కు ముందు విడుదలైన పీరియాడికల్ మూవీ ‘పలాస 1978’ పర్వాలేద నిపించుకోగా.. రామ్ చరణ్ ‘రంగస్థలం’ ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే.
అలాగే. మెగాస్టార్ ‘సైరా’ చిత్రం కూడా పీరియాడికల్ జోనర్ లోకే వస్తుంది. ఈ తరహా చిత్రాలకు మంచి రీచ్ ఉండడంతో .. ప్రస్తుతం మరికొన్ని సినిమాలు ఆ కోవలోనే పీరియాడికల్ గా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాధేశ్యామ్ మూవీ పీరియాడికల్ మూవీ అని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో ప్రభాస్ పామిస్ట్రీ పండితుడిగా నటిస్తున్నాడని కూడా వార్తలొస్తున్నాయి. ఒకానొక కాలంలో జరిగిన రొమాంటిక్ థ్రిల్లర్ గా రాధేశ్యామ్ రూపొందుతోందని చెబుతున్నారు. పాన్ ఇండియా కేటగిరిలో పలు భాషల్లో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి తదితరులు నటిస్తోన్న నక్సల్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘విరాటపర్వం’. 1992లో పీపుల్స్ వార్ ఉధ్రుతంగా ఉండే సమయంలో కొందరు నక్సల్స్ దండకారణ్యంలో తలదాచుకున్నారు. ఆ సమయంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని .. యువ దర్శకుడు వేణు ఊడుగులవ ‘విరాటపర్వం’గా తెరకెక్కిస్తున్నాడు. ఆ మధ్య రానా, సాయిపల్లవి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుడలై.. మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. టైటిల్ ను బట్టి చూస్తే… విరాట పర్వం అంటే.. పాండవుల అజ్ఞాత వాసం కాబట్టి… నక్సల్స్ అజ్ఞాతంగా ఉండే కథతోనే ఈ సినిమా తెరకెక్కుతోందని అర్ధమవుతోంది. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి.
ఇటీవల సాయిధరమ్ తేజ కొత్త సినిమా ఒకటి అనౌన్స్ అయింది. కార్తిక్ దండు అనే కొత్త కుర్రోడు దీనికి దర్శకుడు. 70లో జరిగిన కథగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ముఖ్యంగా ఈ సినిమా అతీత శక్తుల నేపథ్యంలో రూపొందనుందని తెలుస్తోంది. ఆ కాలంలో ప్రజల్లో మూఢనమ్మకాలు బాగా ఉండేవి. అప్పుడు జరిగిన కొన్ని సంఘటనల్ని బేస్ చేసుకొని .. హారర్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. మరి మెగా మేనల్లుడికి ఆ జోనర్ ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి. సో.. పీరియాడికల్ జర్నీ చేస్తోన్న ఈ హీరోల్లో ఎవరిది పై చేయి అవుతుందో వెయిట్ అండ్ సీ.