ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం ఉండదని మన సామెతలు ఊరికే అనలేదు. దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా తన గురువు రాంగోపాల్ వర్మ లాగా వివాదాల జోలికి పోతున్నట్లు ఉంది. కరోనా కాలంలో ఆయన ఇంట్లో ఉంటూ పాడ్ కాస్ట్ ఆడియోలతో జనం ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజా పాడ్ కాస్ట్ లో ఉచిత విద్య, రిజర్వేషన్లు, ఓటు హక్కులపై ఆయన గళం విప్పారు. ఉచిత పథకాలను ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇచ్చే ఉచితపథకాలను అందుకుంటూ పేదవాడిగా బతకడం జనానికి అలవాటైపోయిందని ఆయన వ్యాఖ్యాలు చేశారు. అందుకే వైట్ కార్డు ఉన్న వాళ్ల ఓటు హక్కును రద్దు చేయాలని ఆయన డిమాండు చేశారు.
నీకు జీవితమే బరువుగా ఉన్నపుడు ఓ లీడర్ జీవితాన్ని నీ చేతిలో ఎలా పెట్టమంటావ్ అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు కూడా కులాన్ని బట్టి ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు. పేదోడు ఏ కులంలో ఉన్నా ఆదుకోవాలన్నారు. అలాగే నిరక్షరాస్యుల ఓటు హక్కు తీసేయాలన్నారు. ఓటు వేయాలంటే కనీస విద్యార్హత ఉండాలన్నారు. ‘కాళ్లు, చేతులు బాగున్నప్పుడు మన చేతులు చాచొద్దు’ అని ఆయన నినదించారు. నిజానికి ఆయన మాటల్లో వాస్తవం ఉన్నా అవి వివాదాస్పమయ్యాయి. దళిత సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని బాధ్యత రాహిత్య వ్యాఖ్యులుగా అభివర్ణిస్తున్నారు. మరికొందరైతే పూరిని సపోర్ట్ చేస్తున్నారు.