ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయగా… పీఎం ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. .ప్రదాని పర్యటనను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ రేంజిలో శ్రమించిందని చెప్పాలి. చంద్రబాబు మంత్రులతో ఓ కమిటీని వేసి… మోదీ సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇక నారా లోకేశ్ అయితే… నేరుగా రంగంలోకి దిగి మోదీ టూర్ ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూసుకున్నారు. లోకేశ్ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందనే చెప్పక తప్పదు. లోకేశ్ తో మోదీ ప్రత్యేకంగా పిలిచి మరీ మాట్లాడడమే కాకుండా…ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ రావాలంటూ యువ నేతకు ఆహ్వానం పలికారు. ఈ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకంత షాక్ కు గురి అయ్యారు.
మోదీ, లోకేశ్ ల మాటామంతి సన్నివేశం గురించిన వివరాల్లోకి వెళితే… ప్రధాని హోదాలో మోదీ విశాఖలో అడుగుపెట్టగా… సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు గవర్నర్ తో కలిసి ఆయనకు ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి సమీపంలోనే ఉన్న విడిదికి మోదీ చేరుకున్నారు. రాష్ట్రానికి వచ్చిన మోదీకి స్వాగతం పలికేందుకు లోకేశ్ సహచర మంత్రులతో కలిసి ఆ విడిదిలో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో విడిదిలోకి వచ్చినంతనే లోకేశ్ దగ్గరకు వెళ్లిన మోదీ…యువనేతతో మాట కలిపారు. “లోకేశ్ బాబూ… నీ మీద ఓ కంప్లైంట్ ఉందబ్బా. ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. అయినా మీరు ఢిల్లీ వచ్చి నన్ను కలవనే లేదు. ఢిల్లీ వచ్చి కూడా నన్ను కలవకుండానే వెళ్లిపోయారట. ఫ్యామిలీతో ఢిల్లీ వచ్చి నన్ను కలువు” అంటూ మోదీ సరదా వ్యాఖ్యలు చేశారట. అదేదో లోకేశ్ తనకు మంచి మిత్రుడన్నట్లుగా మోదీ వ్యవహరించిన తీరు చంద్రబాబు, పవన్ లతో సహా అక్కడున్నవారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వాస్తవానికి ఎక్కడికెళ్లినా మోదీ చాలా సరదాగా ఉంటారు. ఆయా ప్రాంతాల నేతలతో సఖ్యతగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తారు. అలాంటిది ఏపీలో కూటి విజయానికి యువగళం పాదయాత్రతో పునాది రాయి వేసిన లోకేశ్ కనిపిస్తే…మోదీ అక్కున చేర్చుకుంటారు కదా. ఏపీలో మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చినన్ని సీట్లు గతంలో ఆ పార్టీకి ఎప్పుడూ రాలేదు. 8 అసెంబ్లీ సీట్లతో పాటుగా 2 ఎంపీ సీట్లను కూడా ఆ పార్టీ గెలిచింది. ఇదంతా లోకేశ్ వల్లే సాధ్యమైంది.
ఇక ఎన్డీఏ మూడో దఫా కేంద్రంలో అధికారం చేపట్టడం. తాను ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టడానికి ఎన్డీఏ పక్షాలు కీలక భూమిక పోషించిన విషయం, ఆ పక్షాల్లో టీడీపీ రెండో అతి పెద్ద పార్టీగా అవతరిచిన తీరు, అందుకోసం లోకేశ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్న మోదీ… లోకేశ్ ను ఆప్యాయంగా పలకరించారు. మోదీ పిలుపుతో మైమరచిపోయిన లోకేశ్ త్వరలోనే ఢిల్లీ వచ్చి కలుస్తాను సార్ అంటూ బదులిచ్చిన తీరు అక్కడి వారిని ఆకట్టుకుంది.