గత ఎన్నికల ముందు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు దేశం పార్టీ అధినేతతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత వచ్చిన ఫలితాలతో ఆయన చంద్రబాబుతో మరింత కలుపుగోలుగా ఉంటున్నారు. ఏపీకి అన్ని విధాలుగా సహకారం అందిస్తానని, ఇద్దరం కలిసి రాష్ట్ర, దేశ పురోగతికి పని చేద్దామని మోదీ వివిధ సందర్భాల్లో చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్టులు చేస్తున్నారు.
తాజాగా కూడా ప్రధాని మోదీ టీడీపీని, చంద్రబాబును, ఆ పార్టీ ఎంపీలను ఉద్దేశిస్తూ ఓ సోషల్ మీడియా పోస్టు చేశారు. బుధవారం (జూన్ 26) తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ప్రధాని మోదీ ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు మోదీని శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత ఆ మీటింగ్ గురించి మోదీ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నా సహచర ఎంపీలు నన్ను కలిశారు. నా మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలో మా రెండు పార్టీలు కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ లో చాలా సన్నిహితంగా పని చేస్తున్నాయని ఆ పోస్టులో రాశారు. భారతదేశ ప్రగతికి, అలాగే ఏపీ అభివృద్ధికి సాధ్యమైనంతగా పని చేస్తామని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.
గత సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో అత్యధిక ఎంపీ స్థానాలు బీజేపీ తర్వాత టీడీపీవే. కాబట్టి, టీడీపీ అవసరం ప్రస్తుతం మోదీకి బాగా ఏర్పడింది. అందుకే అటు చంద్రబాబుతో, ఇటు టీడీపీ ఎంపీలతో మోదీ చాలా సఖ్యతగా, కలుపుగోలుగా ఉంటూ వస్తున్నారు. ప్రధాని మోదీ చేసిన ఈ పోస్ట్ కి సీఎం చంద్రబాబు స్పందించారు.
‘‘తప్పకుండా మోదీ జీ.. మా ఎంపీలు లోక్ సభలో ఏపీకి సమర్థవంతమైన ప్రాతినిధ్యం కల్పిస్తారు. కేంద్రంలో మీ నాయకత్వంలో మన పార్టీలు కలసి వికసిత్ ఏపీ, వికసిత్ భారత్ కోసం పని చేస్తాయి’’ అని జవాబు ఇచ్చారు. అయితే, మోదీ ఇలా తమను కలిసిన విషయాన్ని ప్రత్యేకంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలపడం టీడీపీ ఎంపీలకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి రోజూ ప్రధాన మంత్రిని వివిధ పార్టీల ఎంపీలు కలుస్తారు. కానీ, ఇలా ప్రత్యేకంగా సోషల్ మీడియా పోస్టులు ఎవరికీ పెట్టరు. కానీ, టీడీపీ ఎంపీల విషయంలో ఇలా పోస్టులు పెట్టారంటే.. ఆ పార్టీ తమ కూటమిలోనే ఉండాలని మోదీ ఆశిస్తున్నట్లుగా అర్థం అవుతోంది. అవసరమైతే ఏపీకి కావాల్సిన ప్రత్యేక ప్రోత్సాహకాలు, నిధులు, రాజధాని డెవలప్‌మెంట్ సహా ఇతర విషయాల్లో తాము సహకారం అందిస్తామనే సంకేతాలను మోదీ ఇలాంటి సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.











