పోలవరం ప్రాజెక్టు… 13 జిల్లాలతో, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొత్త ప్రయాణం ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్‌కు నిజంగానే జీవనాడే. అందుకే కాబోలు… ఏపీ పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తున్నట్లుగా, ఆ ప్రాజెక్టును పూర్తిగా తామే నిర్మించి ఇస్తామని నాటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేసింది. రాష్ట్ర విభజనతో ఆస్తులు లేక అప్పులతోనే ప్రయాణం ప్రారంభించాల్సిన దుస్థితిలోని ఏపీకి ఈ తరహా మినహాయింపు తప్పనిసరి కూడా. అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుతో పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడికి కాకుండా పెను భారంగా, గుది బండగా మారే ప్రమాదముందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అసలు ఈ ప్రాజెక్టు అంచనాలకు సంబంధించి ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ దశా దిశా లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పాలి. అసలు పోలవరం ప్రాజెక్టు అంచనా ఎంత? పాతది ఎంత? కొత్తది ఎంత? అసలు ఏ అంచనా మేరకు కేంద్రం నిధులిస్తామని ఒప్పుకుంది?… తదితరాలపై కూడా ఇప్పటికీ స్పష్టత లేకపోవడం నిజంగానే… పోలవరం ప్రాణం తీసే పరిణామమేనని చెప్పాలి.
ప్రాజెక్టు కట్టకుండానే కాల్వలు తవ్వకం
ఏళ్ల క్రితం ప్రతిపాదించిన పోలవరం ప్రాజెక్టుకు చాలా ఆసల్యంగా పునాదులు పడితే… ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. అదేంటో గానీ ప్రాజెక్టు కట్టకుండానే ఆ ప్రాజెక్టు ద్వారా పంటలకు అందే నీటి కోసం కాలువలు తవ్వేశారు. అయితే రాజశేఖరరెడ్డి అకాల మరణంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోగా… నాలుగేళ్లు తిరక్కుండానే రాష్ట్ర విభజన జరిగిపోయింది. 13 జిల్లాలతో కొత్త ప్రయాణం ప్రారంభించిన ఏపీకి తొలి సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పదవీ బాధ్యతలు చేపట్టి పోలవరం ప్రాధాన్యతను గుర్తించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర సస్యశ్యామలమవుతుందని, ఈ ప్రాజెక్టు ఏపీకి జీవనాడేనని ప్రకటించారు. కేంద్రంతో విడతల వారీగా చర్చలు జరిపి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకునేలా, నిధులు కేంద్రం విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
కేంద్రం మెలికను పటాపంచలు చేసిన చంద్రబాబు
ఇక్కడే కేంద్రం పెట్టిన మెలికను చంద్రబాబు పటాపంచలు చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా 2013-14 ఆర్థిక సంవత్సరం ప్రకారం రేూ.29,027.95 కోట్లు అయితే 2017-18కి వచ్చేసరికి వ్యయం ఏకంగా రూ.57,980.87 కోట్లకు పెరిగిపోయిందని పక్కా గణాంకాలతో కేంద్రానికి నివేదిక పంపి 2019 ఫిబ్రవరి 11 నాటికి ఆ వ్యయ అంచనాను రూ.55,548.87 కోట్లకు కేంద్రంతో ఆమోదింపజేశారు. అంటే… ప్రాజెక్టు వ్యయం మొత్తాన్ని రూ.29వేల కోట్ల నుంచి రూ.55 వేల కోట్లకు పెంచడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెంది వైస్సార్‌సీపీ విజయం సాధించడంతో చంద్రబాబు ప్లేస్ లో కొత్త సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి రాష్ట్ర ప్రాధాన్యాల విషయంలో క్రమంగా మార్పు కనిపించగా, ఇప్పుడు ఏకంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు దక్కడమే గగనంగా మారిపోయింది. తాజాగా పోలవరం ప్రాజెక్టు పునరావాసం తమకు సంబంధం లేని అంశమని, తాము కేవలం నీటి పారుదల నిర్మాణాలకు మాత్రమే నిధులస్తామని కేంద్రం కొత్త మెలిక పెట్టేసింది. అయినా పునరావాసం లేకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడైనా సాధ్యమేనా? అసలు పునరావాసానికే కదా ఎక్కువ నిధులు అవసమయ్యేది. ఈ అంశాలన్నీ తెలిసినా కూడా కేంద్రం ఈ తరహా మొండి వాదనను తెరపైకి తీసుకువచ్చిందన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
కేంద్రం వైఖరిని ఖండించాల్సిన బాధ్యత జగన్ సర్కారుది కాదా..?
పోలవరానికి సంబంధించిన భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు యత్నించడం , సొంత రాష్ట్రానికి జీవనాడిలా మారే పోలవరంపై కేంద్రం వైఖరిని ఖండించాల్సిన బాధ్యత ఉన్న జగన్ సర్కారు కేంద్రం చెప్పిందే కరెక్టన్న రీతిలో వ్యవహరించడం నిజంగానే అమితాశ్చర్యానికి గురి చేసేదే. ఎందుకంటే , పోలవరం పునరావాసం తమ బాధ్యత కాదని కేంద్రం చెప్పిందంటే పోలవరాన్ని పూర్తి చేయడం మోదీ సర్కారుకు ఇష్టం లేనట్టే. ఆ విషయం అంతగా స్పష్టమవుతున్నా కూడా దానిపై ఏమాత్రం గళం విప్పకుండా తప్పంతా గత ప్రభుత్వాలదేనని వైస్సార్‌సీపీ సర్కారు వాదించడం గమనార్హం. పోలవరం ప్రాణం తీయడానికి కేంద్రం పథకం రచిస్తే జగన్ సర్కారు అమలు చేయడానికి సిద్ధమేనని చెప్పడమే కదా. ఇక్కడ మరో కీలకాంశాన్ని ప్రస్తావించుకోవాలి. చంద్రబాబు హయాంలో పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా కేంద్రం ఆమోదిస్తే.. దానిని ఇప్పటి వైస్సార్‌సీపీ సర్కారు రూ.43,164.63 కోట్లకు తగ్గించేసుకుని, ఆ మేర నిధులిస్తే సరిపోతుందని వాదిస్తోంది. ఏటికేడు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ప్రాజెక్టు వ్యయాలు కూడా పెరుగుతూ పోతుంటే జగన్ సర్కారేమో అంచనాలను తగ్గించేసుకుంటోంది. మొత్తంగా ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే పోలవరం ప్రాణం తీసేట్టుగానే కనిపిస్తున్నాయి.











