ఒకప్పుడు సౌత్ సినిమాల్ని చాలా చిన్నచూపు చూసేవారు బాలీవుడ్ జనం. మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమాల్ని కావాలని చులకన చేసేవారు. కానీ కొంతకాలంగా.. మన సినిమాల్ని నార్త్ జనం కళ్ళప్పగించి మరీ చూసేస్తున్నారు. బాహుబలి మ్యాజిక్ తర్వాత దాని మోతాదు మరింత ఎక్కువైంది. సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిన ఈ కాలంలో ప్రేక్షకుల హద్దులు చెరిపేసింది యూట్యూబ్. దక్షిణాది భాషల సినిమాలన్నీ డబ్బింగ్ రూపంలో యూట్యూబ్ ను ముంచెత్తుతున్నాయి. ఆ క్రమంలో మన సినిమాల్ని ఓ రేంజ్ లో ఆదరిస్తున్నారు నార్త్ పీపుల్. థియేటర్స్ లో ప్లాప్ అయిన సినిమాలకు సైతం యూట్యూబ్ లో కళ్ళు చెదిరే రీతిలో వ్యూస్ వచ్చిపడిపోతున్నాయి.
మన సినిమాల్లో యాక్షన్ మోతాదు అధికంగా ఉండడం.. వల్లే వారికి బాగా కనెక్ట్ అవుతున్నాయని చెప్పాలి. దీని వల్ల నార్త్ ప్రొడ్యూసర్స్ కు కాసులు బాగా రాలుతుండడంతో మన యాక్షన్ సినిమాలన్నీ హీరోలతో సంబంధం లేకుండా యూ ట్యూబ్ లోకి దిగిపోతున్నాయి. అంతేకాదు.. తెలుగు లో ఫ్లాప్ అయిన సినిమాలు.. నష్టాలు తెచ్చుకున్నా.. యూ ట్యూబ్ లో డబ్బింగ్ చేసుకుంటే వాటికి కొంతైనా కాసులు కురుస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు. మొన్నామధ్య యన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ని యూ ట్యూబ్ లో తెగ చూసేశారు. ఫ్లాప్ సినిమా అయినప్పటికీ .. దానికి అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ వచ్చాయి.
దాని తర్వాత యన్టీఆర్ దమ్ము కూడా యూ ట్యూబ్ లో దుమ్మురేపింది. అలాగే.. రామ్ నటించిన ‘శివమ్’ సినిమా కూడా యూ ట్యూబ్ లో భలేగా మ్యాజిక్ చేసింది. ఆ సినిమా కూడా షాకింగ్ వ్యూస్ తెచ్చుకుంది. అయితే ఇప్పటివరకూ ఆ కేటగిరిలో అన్నిటికన్నా బాగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అల్లు అర్జున్ ‘సరైనోడు’. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ వీర లెవెల్లో విజృంభించిన ఈ సినిమా. దీనికి 300 మిలియన్స్ కు పైగానే వ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ వంతు వచ్చింది. బోయపాటి దర్శకత్వంలో అతడు నటించిన ‘జయ జానకి నాయక’ సినిమా యూట్యూబ్ లో ఖూన్ఖర్ గా విడుదలై.. ప్రభంజనం సృష్టిస్తోంది. నిజానికి ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయింది.
అయినప్పటికీ బోయపాటి స్టైలాఫ్ యాక్షన్ సీన్స్ కు కొదవలేకపోవడంతో నార్త్ జనానికి ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది . దీనికి కూడా ఏకంగా 300 మిలియన్స్ వ్యూస్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకగా నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్ , నందు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అల్లు అర్జున్ ‘సరైనోడు’, బెల్లంకొండ జయ జానకి నాయక సినిమాలకు బోయపాటే దర్శకుడు కావడం.. రెంటింట్లోనూ హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉండడం.. విలనిజం కూడా ఆకట్టుకునే రీతిలో ఉండడం వల్లనే వీటికి యూ ట్యూబ్ లో విపరీతమైన ఆదరణ దక్కింది. దీంతో బెల్లంకొండ గత సినిమాలు కూడా యూ ట్యూబ్ లో డబ్బింగ్ రూపంలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.











