ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల కింద టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు నిజంగానే విమర్శల పాలు అవుతోంది. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా కొమ్మారెడ్డి అసభ్యకర వ్యాఖ్యలే చేసి ఉంటే.. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులకు అడ్డే లేదనే చెప్పాలి. అయితే పట్టాభిని అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వందలాది మంది పోలీసులు తరలివెళ్లడం, పట్టాభి ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ ఆయనను అదుపులోకి తీసుకోవడం ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పట్టాభిని తరలిస్తున్న పోలీసు వాహనానికి సరిగ్గా పట్టాభి కూర్చున్న దగ్గర ఓ ముసుగు లాంటి వస్త్రాన్ని కట్టిన పోలీసుల తీరుపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టాభిని మీడియా ఫొటోలు, వీడియోలు తీయకూడదన్న భావనతోనే పోలీసులు ఈ పరదా లాంటి వస్త్రాన్ని ఏర్పాటు చేసినా.. పట్టాభి ఏమీ దేశ ద్రోహో, ఉగ్రవాదో కాదు కదా. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీలో కీలక నేత. ఆ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి కూడా కదా. మరి ఇలాంటి నేతను తరలించేటప్పుడు పరదాలు, ముసుగులు వేయాల్సిన అవసరం ఏముందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హైడ్రామా మధ్య అరెస్ట్
పట్టాభి అరెస్ట్ సందర్భంగా పోలీసులు అతిగా వ్యవహరించారని చెప్పక తప్పదు. జగన్‌పై విమర్శలు చేస్తూ పట్టాభి తన పార్టీ కేంద్ర కార్యాలయంలోనే మీడియా సమావేశం పెట్టారు. ఆ తర్వాత వైసీపీ శ్రేణులు దాడి చేసిన సమయంలోనూ ఆయన అక్కడే ఉన్నారు. ఆ తర్వాత పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వచ్చిన సమయంలోనూ పట్టాభి అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అందరు నేతల మాదిరే పట్టాభి కూడా ఇంటికెళ్లారు. బుధవారం నాడు కూడా ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆ తర్వాత తిరిగి ఇంటికెళ్లారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనుకుంటే.. పట్టాభిని ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు కూడా. అంతేకాకుండా వైసీపీ దాడుల తర్వాత కూడా పట్టాభి ఎక్కడికీ పారిపోలేదు. అజ్ఞాతంలోకి అసలే వెళ్లలేదు. అయినా కూడా ఆయన ఏదో పారిపోబోతున్నట్లుగా సీన్ క్రియేట్ చేసిన పోలీసులు.. పట్టాభి ఇంటికి ఏకంగా 200 మంది పోలీసులను తరలించి.. పట్టాభి ఇంటి తలుపులను బద్ధలు కొట్టి మరీ నానా రచ్చ చేసిన వైనంపై సర్వత్రా విమర్శలు రేకెత్తుతున్నాయి.
కేసెక్కడ?.. తరలించిందెక్కడికి?
పట్టాభి అరెస్ట్ సందర్భంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలోని గవర్నర్ పేట పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా పోలీసులు చెప్పారు. అయితే రాత్రి వేళ పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు తొలుత గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌కే తరలిస్తున్నట్లుగా చెప్పి.. ఆయనను అక్కడికి కాకుండా కృష్ణా జిల్లా పరిధిలోని తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కు ఆయనను తరలించి అక్కడ ఆయన ఐరిస్, ఫింగర్ ప్రింట్లను సేకరించారు. దీంతో అసలు పట్టాభిని బుధవారం రాత్రి ఎక్కడ ఉంచారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తమ అదుపులో ఉన్న పట్టాభిని మీడియా ప్రతినిధులు ఫొటోలు గానీ, వీడియోలు గానీ తీయరాదన్నట్లుగా పట్టాభి కూర్చున్న పోలీసు వాహనానికి సరిగ్గా పట్టాభి కూర్చున్న ప్రాంతంలోని అద్దానికి ఓ గుడ్డను అడ్డంగా కట్టారు. పోలీసుల అదుపులో ఉన్నది ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత కదా. పట్టాభి ఏమీ దోషి అని కోర్టు తీర్పు ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు పట్టాభి ఓ ఉగ్రవాదో, తీవ్రవాదో అన్నట్లుగా ఆయన ముఖం మీడియాకు కనబడకూడదన్న రీతిలో అద్దానికి అడ్డంగా ఓ వస్త్రాన్ని కట్టడం ఎందుకు? అన్న దిశగా పోలీసుల వ్యవహార సరళిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పట్టాభికి 14 రోజుల రిమాండ్
ఇదిలా ఉంటే.. పట్టాభికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జైలుకు తరలించనున్నారు. బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన కొమ్మారెడ్డిని పోలీసులు గురువారం మధ్యాహ్నం తర్వాత విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కోర్టులో హాజరుపరచారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పట్టాభిని అరెస్ట్ చేసినట్లుగా న్యాయమూర్తికి పోలీసులు చెప్పారు. అదే సమయంలో తనపై పోలీసులు ఏ రీతిన దాష్టీకానికి పాల్పడ్డారోనన్న విషయాన్ని పట్టాభి కూడా వివరించారు. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి.. పట్టాభికి రిమాండ్ విధించారు. మరోవైపు పట్టాభి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిని తిరస్కరించిన న్యాయమూర్తి పట్టాభిని రిమాండ్‌కు తరలించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.











