టీడీపీ కార్యాలయం వైసీపీ శ్రేణులు విరుచుకుపడి.. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటుగా కనిపించిన టీడీపీ నేతలపై భౌతిక దాడులకు దిగితే.. టీడీపీకి చెందిన వారినే అరెస్ట్ చేస్తూ ఏపీ పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారంటూ 70 మంది వైసీపీ కార్కర్తలపై కేసులు పెట్టిన పోలీసులు.. వారి కోసం గాలింపు కూడా చేపట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇప్పటిదాకా ఆ 70 మందిలో ఒక్కరంటే ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. దాడికి పాల్పడ్డ వారిని వదిలేసిన పోలీసులు.. ఈ ఘటనలో బాధితురాలి స్థానంలో ఉన్న టీడీపీకి చెందిన నేతలనే టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. టీడీపీ కార్యాలయంలోకి వచ్చిన డీజీపీ పీఆర్‌వోను కొట్టారన్న ఆరోపణలపై టీడీపీ యువ నేత బ్రహ్మం చౌదరిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా బ్రహ్మం చౌదరిని ఇప్పటికే కోర్టులో హాజరుపరచి గుంటూరు జైలుకు కూడా తరలించారు.
కొట్టిందెవరు?.. దెబ్బలు తిన్నదెవరు?
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై మంగళవారం సాయంత్రం వైసీపీ శ్రేణులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం కాగా.. పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించిన టీడీపీ నేతలు చికిత్సలు చేయించారు. చికిత్స తర్వాత బాధితులు పార్టీ కార్యాలయానికి వస్తున్నా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా వైసీపీకి చెందిన కార్యకర్తలు దాడులకు తెగబడితే.. టీడీపీ కార్యకర్తలు వారి చేతిలో దెబ్బలు తిన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి నిందితులను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు.. ఆ పనిని వదిలేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్త బద్రీ ఫిర్యాదుతో 70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులైతే నమోదు చేశారు గానీ.. వారి కోసం గాలింపు కూడా మొదలెట్టలేదు. అయితే డీజీపీ పీఆర్‌వో ఫిర్యాదు చేశారో, మరోవరు ఫిర్యాదు చేశారో తెలియదు గానీ.. డీజీపీ పీఆర్‌వోను కొట్టారంటూ టీడీపీ యువ నేత బ్రహ్మం చౌదరి కోసం వేట సాగించిన పోలీసులు గురువారం మధ్యాహ్నం ఆయనను అరెస్ట్ చేశారు. ఆపై కోర్టులో హాజరుపరచిన అనంతరం బ్రహ్మం చౌదరిని గుంటూరు జైలుకు తరలించారు.
టీడీపీ ఆఫీస్‌లో డీజీపీ పీఆర్‌వోకు ఏం పని?
టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నప్పుడు డీజీపీకి పీఆర్‌వోగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఘటనా స్థలంలో ఎందుకున్నారు? అయితే గియితే పోలీసు అధికారులు, పోలీస్ కానిస్టేబుళ్లు, దాడులను నిరోధించేందుకు వినియోగించే ఇతర సాయుధులు అక్కడ ఉండాలి గానీ.. అడ్మినిస్ట్రేషన్ విధుల్లో ఉండే.. అసలు శాంతి భద్రతలకు సంబంధం లేదని డీజీపీ పీఆర్‌వోకు అక్కడ ఏం పని? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మా కార్యాలయంపై దాడి చేసేందుకు వైసీపీ శ్రేణులు వస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే.. మంగళగిరి అర్బన్, రూరల్ పోలీసులు ప్రశ్నల మీద ప్రశ్నలేసి విసిగిస్తే.. స్వయంగా డీజీపీ పరేడ్ గ్రౌండ్ లో ఉంటే.. డీజీపీ కార్యాలయంలో ఉండాల్సిన పీఆర్‌వో టీడీపీ కార్యాలయానికి ఎందుకెళ్లారు? అసలు పీఆర్‌వో పని ఏమిటి? డీజీపీని కలిసేందుకు వచ్చే వారి వివరాలు, డీజీపీ అపాయింట్‌మెంట్లు, డీజీపీ అడిగే ఇతరత్రా సమాచార సేకరణ కోసం నియమితులైన పీఆర్‌వో.. వైసీపీ శ్రేణులు విరుచుకుపడిన టీడీపీ కార్యాలయానికి.. సరిగ్గా దాడి జరిగే సమయానికే అక్కడికి ఎందుకెళ్లారు? అంతేకాకుండా టీడీపీ నేతల చేతిలో ఎందుకు దెబ్బలు తిన్నారు? ఇలాంటి ప్రశ్నలకు ఎవరు సమాదానాలు చెబుతారో? బ్రహ్మం చౌదరి ఎప్పుడు విడుదలవుతారో? చూడాలి.