(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్వగ్రామమైన విజయనగరం కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం కన్నా ఆ పార్టీ రెబల్స్ నుండే గట్టి పోటీ ఎదురవుతోంది. మంత్రి బొత్స, స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జి కోలగట్ల వీరభద్రస్వామి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి .. రెబల్స్‌ను అనేక విధాలుగా బుజ్జగించినప్పటికీ ఫలితం లేకపోయింది.
బీసీ మహిళకు రిజర్వు..
విజయనగరం కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వు అవ్వడంతో పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉండగా ..మొత్తం ఓటర్లు..2,04,421మంది. వారిలో పురుషులు..1,00,003 మంది. మహిళలు..1.04,388, ఇతరులు..30 మంది ఉన్నారు. వైసీపీ, టీడీపీలు 50 డివిజన్లలో అభ్యర్థులను నిలపగా , ఇండిపెండెంట్లుగా 38 వార్డుల్లో అభ్యర్థులు నిలిచారు. సుమారు 19 వార్డుల్లో వైసీపీ రెబల్స్ ఉన్నారు. వీరు ఆయా డివిజన్లలో సామాజికంగాను, ఆర్థికంగాను పటిష్టమైన స్థితిలో ఉండటంతో అధికారపక్షం గుండెల్లో గుబులు రేపుతోంది. అంతేకాకుండా వీరిలో చాలామంది మాజీ కౌన్సిలర్లు, దశాబ్దాల కాలంగా ప్రత్యక్ష, క్రియాశీల రాజకీయంలో ఉన్నవారు అవ్వడంతో గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
తెలుగుదేశంకు కలిసొచ్చేనా ..?
విజయనగరం పురపోరులో వైసీపీ మధ్య వర్గ విభేదాలు తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న విజయనగరం అనూహ్య పరిస్థితుల్లో ప్రస్తుత పురపోరులో వెనుకబడినప్పటికీ .. వైసీపీ రెబల్స్ వల్ల మేలు చేకూరే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించినా విజయనగరం తొలి మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు టీడీపీ తన సర్వశక్తులూ ఉపయోగిస్తోంది. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు అశోకగజపతి నేతృత్వంలో టీడీపీ పూర్వవైభవం దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
Must Read ;- టీడీపీ దూకుడు, వైసీపీలో తడబాటు.. హాట్ హాట్‌గా విజయవాడలో ఎన్నికల ప్రచారం