యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా ఈ చిత్రంలో చేయబోతోన్న విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత ప్రభాస్ మరో పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’లో చేసేందుకు ఓకే చెప్పాడు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ కంఫార్మ్ అవ్వలేదు. ‘ఆదిపురుష్’ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ సినిమా వార్తలే కానీ, నాగ్ అశ్విన్ సినిమా గురించి ఎటువంటి వార్తలు వినిపించడం లేదు. అయితే తాజాగా ప్రభాస్‌తో సినిమా చేసే ముందు ఓటీటీ కోసం నాగ్ అశ్విన్ ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో శృతిహాసన్ ప్రదాన పాత్ర పోషించనుందని అంటున్నారు. లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సిరీస్‌ను నలుగురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారట. అయితే తనకొచ్చిన పార్ట్‌ను నాగ్ అశ్విన్ కంప్లీట్ చేసినట్లుగా సమాచారం.
ప్రభాస్‌తో సినిమా అనుకున్న తర్వాత నాగ్ అశ్విన్ కామ్‌గా ఈ వెబ్ సిరీస్‌ను పూర్తి చేశాడని అంటున్నారు. మరో వైపు ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో కూడా పాల్గొంటున్నారట. ఈ రెండు చిత్రాల తరవాత ప్రభాస్ తెలుగులో వరుసగా సినిమాలను ఓకే చేస్తాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ఏదిఏమైనా ప్రభాస్ వరస పాన్ ఇండియా సినిమాల్లో నటించడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.