చాలా కాలంగా మంచు విష్ణు సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. ఆచారి అమెరికా యాత్ర తర్వాత ఎందుకో ఈయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. దానికితోడు ఆ తర్వాత విడుదలైన ఓటర్ కూడా దారుణంగా నిరాశ పరిచింది. ముఖ్యంగా ఓటర్ సినిమా విషయంలో చాలా గొడవలు అయ్యాయి కూడా. ఓటర్ సినిమా డైరెక్టర్ హీరో మంచు విష్ణుపై సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా వరసగా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండటంతో విష్ణు ఇప్పుడు పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ కథతో వస్తున్నాడు. కాజల్, ఈయన జంటగా మోసగాళ్లు అనే సినిమా వస్తుంది. జంటగా అంటే ఇందులో జోడీ అని కాదు. అన్నా చెల్లెళ్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కాం నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, మోషన్ పోస్టర్, థీమ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఈ సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మంచు విష్ణు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
దీని కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సహాయం తీసుకుంటున్నారు విష్ణు. ఇంతకుముందు టైటిల్ కి థీమ్ మ్యూజిక్‌ను విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేయగా దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ‘మోసగాళ్ళు’ చేసిన స్కామ్ ఏ స్థాయిలో ఉందో బయటపెట్టేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. అక్టోబర్ 3న ఈ విషయాన్ని ఆయన వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అల్లు అర్జున్ కి సౌత్ ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ ను మంచు విష్ణు ఎలా కాష్ చేసుకుంటాడో చూడాలి మరి.











