నాని.. అష్టా చమ్మా అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో నాని సినిమా జీవితం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగిపోతుంది. ముఖ్యంగా నాని నటించిన ఈగ ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఉన్న హీరోల్లో నాని తన నటనతో న్యాచురల్ స్టార్ గా పిలవబడుతున్నాడు. 2015 ప్రథమార్ధంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం 2017 లో వచ్చిన MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం వరకు వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు నాని.
ఇటీవలే ‘వి’ సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అలరించిన నేచురల్ స్టార్ నాని జోరు పెంచారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ మూవీలో నటిస్తోన్న నాని.. ఆ తర్వాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో ‘శ్యామ్ సింగరాయ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ స్టార్ట్ చేయనున్నారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా కథను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మలిచిన విధానం నానికి బాగా నచ్చిందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో నటించే నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్.
ఇందులో నెగిటివ్ ఛాయలున్న ఓ హీరోయిన్ పాత్రకు సాయిపల్లవిని ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రష్మిక మందానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఆమె ఒప్పుకుంటే నానితో రెండోసారి రొమాన్స్ చేయనుంది. గతంలో ‘దేవదాస్’ సినిమాలో నాని సరసన రష్మిక నటించింది. ఈ సినిమా ఒకసారి చూడచ్చు పర్లేదు అని అనిపించింది. మరోవైపు ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్‌ను తీసుకోనున్నట్లు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ సినిమా అంచనాలు భారీగా పెరగడం ఖాయం.











