ఉమ్మడి ప్రకాశం వైసీపీలో ఏం జరుగుతోంది..?? ఆ పార్టీలోని కీలక నేతలు టీడీపీలోకి జంపింగ్ జపాంగ్‌కి రెడీ అవుతున్నారా.?? ఇప్పటికే టీడీపీ యువనేత, చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు లోకేష్‌తో టచ్‌లోకి వచ్చారా.?? ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారా?. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది..
గత కొంతకాలంగా వైసీపీ అధినాయకత్వంపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.. జిల్లాలో కీలకంగా మారిన భూముల దస్తావేజుల స్కామ్ అంశంలో బాలినేని, ఆ పార్టీ హై కమాండ్‌పై అసంతృప్తిగా ఉన్నారు.. ఈ అంశంలో తన అనుచరులనే పోలీసులు టార్గెట్ చేస్తున్నారని, జిల్లాకి చెందిన ఓ ముఖ్యనేత అనుచరులను వదిలేస్తున్నారని బాలినేని ఆరోపిస్తున్నారు.. ఇదే అంశంపై ఆయన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి లేఖ కూడా రాశారు.. దీంతో, బాలినేని పిలిచిన సీఎం కార్యాలయం అధికారులు ఆయనతో మంతనాలు జరిపారు.. కానీ, జగన్ మోహన్ రెడ్డి మాత్రం బాలినేనికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు..
జగన్ వ్యవహారంతో విసిగిపోయిన బాలినేని టీడీపీలో టచ్‌లోకి వచ్చారట.. ఆయనతోపాటు జిల్లాలోని మరికొందరు నేతలు సైతం బాలినేనితో మంతనాలు జరిపారని సమాచారం. ముఖ్యంగాఅధిష్టానంపై కొంతకాలంగా అంటీముట్టనట్లు వ్యవహరిస్తోన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా సైకిల్ ఎక్కడానికి రెడీ అయ్యారని లీకులు వచ్చాయి.. ఈ ఇద్దరితోపాటు ఒకరిద్దరు ఎమ్‌ఎల్‌ఏలు, మరికొందరు సీనియర్ నేతలు సైతం ఎన్‌టీఆర్ భవన్ గడప తొక్కడానికి రెడీ అయ్యారట. వెంటనే ఈ విషయం వైసీపీ హైకమాండ్‌కి తెలియడంతో, నిన్నమొన్నటిదాకా బాలినేనికి అపాయింట్‌మెంట్ నిరాకరించిన జగన్.. హుటాహుటిన వచ్చి కలవాలని ఆదేశాలు పంపారట. శనివారం జగన్‌తో బాలినేని భేటీ కానున్నారు..
బాలినేనితోపాటు, మాగుంట లాంటి నేతలు ఒకేసారి టీడీపీలోకి జంప్ చేస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ కనుమరుగు అవడం ఖాయమని, జిల్లాలో ఆ పార్టీ ఫ్యాన్ రెక్కలు తెగిపడతాయని భావించిన హైకమాండ్.. ఎట్టకేలకు వారితో రాజీకి ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం.. బాలినేనిని బుజ్జగిస్తారా.? లేక, రాజీ ప్రయత్నాలు బెడిసి కొట్టి ఆయనతోపాటు ఇతర నేతలు కూడా సైకిల్ ఎక్కుతారా..? అనేది త్వరలోనే తేలనుంది..