నాడు – నేడు..జగన్ హయాంలో ప్రభుత్వ బడులను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన పథకం. వైసీపీ సైతం ఈ పథకం కింద ప్రభుత్వ బడుల్లో గొప్ప మార్పులు తీసుకువచ్చామని దండోరా వేసి మరీ చెప్పుకుంది. ప్రైవేటు బడులకు దీటుగా సర్కార్ స్కూళ్లను మార్చామని గొప్పలు చెప్పుకుంది. ఐతే వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. దీనికి జగన్ సర్కార్ సంస్కరణల పేరిట అవలంబించిన విధానాలే కారణం. వైసీపీ హయాంలో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చారన్న సంగతి అటుంచితే..గడిచిన ఐదేళ్లలో దాదాపు లక్షలాది మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేసింది జగన్ సర్కార్. అప్పటివరకు ప్రైవేట్ బడులకు పంపాలన్న ఆలోచన తల్లిదండ్రులకు లేకపోయినా, బలవంతంగా ప్రైవేట్ బాట పట్టించేలా వారి ఆలోచనను మార్చివేసింది.
ప్రభుత్వ బడుల్లో చదివు గగనం అనే పరిస్థితి తీసుకొచ్చింది. విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు క్యూ కట్టేలా చేసింది. చివరికి ప్రైవేటు పాఠశాలలకు లబ్ధి చేకూర్చింది. మధ్యలో కొవిడ్ సమయంలో ప్రభుత్వ బడుల్లో భారీగా విద్యార్థులు పెరిగినా..వారిని అక్కడే కొనసాగించడంలోనూ గత ప్రభుత్వం విఫలమైంది. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ బడులు అంటే భయపడే పరిస్థితి దాపురించింది.
జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రాథమిక విద్యపై ప్రయోగాలు చేశారు. ఏ క్షణం ఏ ఆలోచన వచ్చినా దానిని అమలు చేసి స్కూళ్లను భ్రష్టు పట్టించారు. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్ మీడియం పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని రద్దు చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అష్టకష్టాలు పడ్డారు. ఆ వెంటనే కోవిడ్ రావడంతో ప్రైవేట్ బడుల విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. కానీ ఆ తర్వాత తీసుకువచ్చిన జీవో 117 ప్రాథమిక విద్య నాశనానికి దారి తీసింది. వందలాది గ్రామాల్లో బడులు మూతపడేందుకు కారణమైంది.
ఇక తరగతులను విలీనం చేసి ప్రాథమిక విద్యను దారుణంగా దెబ్బతీసింది. 4,250 పాఠశాలల్లోని 3 నుంచి 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించింది. ఈ ఒక్క దెబ్బతో విద్యార్థులు మరో ప్రభుత్వ బడికి కాకుండా సమీపంలోని ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. ఇఖ జీవో 117 ప్రకారం బోధనను రెండుగా విభజించింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రాథమికోన్నత పాఠశాలలపై ప్రయోగం చేసింది. విద్యార్థుల సంఖ్య 92 లేని ప్రాథమికోన్నత పాఠశాలల్లో మొత్తం సెకండరీ గ్రేడ్ టీచర్లను నియమించింది. 92 కంటే ఎక్కువ ఉంటే అక్కడ స్కూల్ అసిస్టెంట్లను ఇచ్చింది. అంటే…సంఖ్య ఆధారంగా అక్కడి విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించింది. వాస్తవానికి 6వ తరగతి నుంచి స్కూల్ అసిస్టెంట్లతో బోధన జరుగుతుంది. కానీ 3 నుంచే స్కూల్ అసిస్టెంట్లతో బోధన అంటూ ప్రకటించి, విద్యార్థుల సంఖ్యతో ముడిపెట్టి 6 నుంచి 8 తరగతులకు కూడా సబ్జెక్టు టీచర్లను లేకుండా చేసింది. దీంతో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండు రకాల విద్యా బోధనలు అమల్లోకి వచ్చాయి.
ఇక సంస్కరణల పేరిట గందరగోళానికి తెరలేపారు జగన్ రెడ్డి.రెండేళ్లలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలను CBSE సిలబస్‌లోకి మార్చేస్తామని ప్రకటించి..ఐదేళ్లలో కేవలం వెయ్యి పాఠశాలలను మాత్రమే CBSEలోకి మార్చగలిగారు. దానిని కప్పిపుచ్చుకునేందుకు అసలు ఎక్కడుందో తెలియని ఇంటర్నేషనల్ బాకలారియేట్‌ని తెరపైకి తెచ్చారు. ఇక మొత్తం ఐబీ సిలబస్ అంటూ ఊదరగొట్టారు. తీరా చూస్తే ఈ సిలబస్ దేశం మొత్తంలో వెయ్యి స్కూళ్లలో కూడా లేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్కో తరగతిని ఐబీలోకి మారుస్తూ 2035 నాటికి ఐబీ సిలబస్‌లో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామంటూ ఐబీతో ఒప్పందం కూడా చేసుకుంది. మరోవైపు ఉన్నత విద్య అనంతరం విదేశాలకు వెళ్లేవారికి అవసరమైన టోఫెల్‌ను సైతం స్కూళ్లలో ప్రారంభించారు. ఇంగ్లిష్ టీచర్లు బోధించాల్సిన టోఫెల్‌ను సైన్స్, సోషల్ టీచర్లు బోధించేలా
తికమక విధానాలు అమలు చేశారు. దీంతో అసలు ప్రభుత్వ పాఠశాలు ఏ దిశలో వెళ్తున్నాయనే ఆందోళన మొదలైంది. ఫలితంగా ప్రభుత్వ బడుల నుంచి తమ పిల్లలను తల్లిదండ్రులు క్రమంగా దూరం చేశారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరి విద్యా సంవత్సరం అంటే 2018-19లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 39,29,019 మంది విద్యార్థులుంటే, 2024-25 విద్యా సంవత్సరం నాటికి ఆ సంఖ్య 34,50,423కు పడిపోయింది. అంటే.. వైసీపీ హయాంలో 4,78,596 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు. కరోనా కాలంలో లాక్‌డౌన్‌లు, వైరస్ ప్రభావం వల్ల ఫీజులు వృథా చేసుకోవడం ఎందుకనే ఆలోచనతో తల్లిదండ్రులు లక్షల మంది విద్యార్థులను ప్రైవేటు బడులు మాన్పించి, ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. దీంతో 2020-21లో విద్యార్థుల సంఖ్య 43,42,874కు పెరిగింది. ఆ తర్వాత 2021-22లో ఆ సంఖ్య 44,29,569కు చేరింది. కానీ కొవిడ్ తగ్గిన వెంటనే ప్రైవేటు నుంచి వచ్చిన విద్యార్థులంతా వెనుదిరిగారు. దీంతో విద్యార్థుల సంఖ్య 2022-23లో 39,95,992కు, 2023-24లో 35,69,506కు పడిపోయింది. గతంలో ప్రభుత్వ బడుల్లో ఉన్న విద్యార్థులు కూడా భారీగా ప్రైవేటు బాట పట్టారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదివేవారు. రెండింటి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండేది. కానీ జగన్ ప్రభుత్వంలో క్రమంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో ప్రైవేటు బడులు బలోపేతం అవుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో దాదాపుగా సమాన స్థాయికి వచ్చారు. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, సంక్షేమ, ఎయిడెడ్ అన్ని రకాల ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో కలిపి ప్రస్తుతం 34,50,423 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 33,99,832 మంది ఉన్నారు. 50 వేలమంది మాత్రమే ప్రభుత్వ బడుల్లో ఎక్కువగా ఉన్నారు. గతంలో ఈ వ్యత్యాసం ఏడెనిమిది లక్షలు ఉండేది. కానీ టీచర్లు మాత్రం ప్రభుత్వం స్కూళ్లలో 1,84,860 మంది ఉంటే, ప్రైవేటు పాఠశాలల్లో 1,24,827 మంది మాత్రమే ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో 60 వేలమంది టీచర్లు తక్కువగా ఉన్నా తల్లిదండ్రులు అటు వైపే మొగ్గు చూపుతున్నారు.
ఈ అంశాలపై విద్యా శాఖ మంత్రి లోకేష్ దృష్టి పెట్టారు.. నాడు నేడుతో విద్యా శాఖకు జరిగిన డ్యామేజ్‌ని నియంత్రించే పనిలో పడ్డారు.. అధికారులతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఇప్పటికే విద్యా శాఖ మంత్రిగా ఆ శాఖలోని అనేక సమస్యలపై అవగాహన పెంచుకున్న నారా లోకేష్ వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఉన్నత విద్య కోసం ఏఐ, స్కిల్ యూనివర్శిటీల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నారు. ఇక, ప్రాధమిక, మాధ్యమిక విద్యలోనూ పలు సంస్కరణలు తీసుకురావడానికి యోచిస్తున్నారు.. ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు కదులుతున్నారు లోకేష్.. జగన్ సర్కార్ చేసిన వినాశనాన్ని సరిదిద్దడానికి ఎంత సమయం పడుతుందో, మరెన్ని లొసుగులు వెలుగులోకి వస్తాయో ఆసక్తిగా మారింది..