రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? నిఘావర్గం అధికారులు అలాంటి అభిప్రాయంతో ఉన్నారా? ఇంటెలిజెన్స్ వారి పరిశీలనలో… నిమ్మగడ్డకు ఎవరైనా ప్రమాదం తలపెట్టవచ్చుననే సంకేతాలు అందాయా? ఈ ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి మాత్రం అవుననే సమాధానమే వస్తోంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వంతో దాదాపు వైరం పెట్టుకున్నంత పనిచేసి.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అయ్యారు. ప్రభుత్వం ససేమిరా అన్నప్పటికీ.. చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. వచ్చిన తీర్పులు నిమ్మగడ్డకు అనుకూలంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం గత్యంతరం లేని స్థితిలో ఎన్నికల నిర్వహణకు పూనుకుంటోంది. గతంలో ఉద్యోగ సంఘాలు.. ఎన్నికలకు తాము సిద్ధంగా లేమంటూ … తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం.. తమ ప్రాణాలను పణంగా పెట్టేట్లయితే.. ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధమేనంటూ సినిమాటిక్ డైలాగులు వల్లించిన నేపథ్యంలో తనకు ప్రమాదం పొంచి ఉందని.. ఎస్ఈసీ నిమ్మగడ్డ డీజీపీకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో.. తాజాగా నిమ్మగడ్డ కార్యాయలం వద్ద పోలీసులు భారీ స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఎన్నికల జరగబోతున్న నేపథ్యంలో.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వ్యక్తిగతంగా కూడా భద్రత పెంచారు. ఎన్నికల కమిషనర్ కార్యాలయం దగ్గర పోలీస్ డాగ్స్ తో సెర్చింగ్ కూడా నిర్వహిస్తున్నారు. నిమ్మగడ్డకు ఏ రకమైన ప్రమాదమైనా పొంచి ఉండచ్చుననే ఇంటెలిజెన్స్ నివేదికల మేరకే.. ఇలాంటి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
అడుగడుగునా పోలీస్ నిఘాతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం అంతా ఖాకీ మయంగా కనిపిస్తోంది. ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి వచ్చే ప్రతి వాహనాన్ని, మనుషులను భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్న సమయంలో.. వాతావరణం మరింత హీటెక్కుతున్నట్టుగా కనిపిస్తోంది.
Must Read ;- కేంద్రానికి.. నిమ్మగడ్డ లేఖ..