ప్రభుత్వ పధాన కార్యదర్శి స్థానం.. చాలా మంది ఐఏఎస్‌ల ఆకాంక్ష. ఆ హోదాకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. ప్రభుత్వ కార్యకలాపాలు చట్ట ప్రకారం, సక్రమంగా జరిగేలా, రాష్ట్రంలోని సమస్త యంత్రాంగాన్ని కాండక్ట్ రూల్స్‌కి అనుగుణంగా నడిపించే బాధ్యత ఆయన భుజస్కందాలపైనే ఉంటుంది. అదే సమయంలో పార్టీ ఏదైనా..అధికారంలో ఎవరు ఉన్నా.. చట్టాల అమలు, అవినీతి రహిత పాలన, రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కూడా ఉంటుంది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రజా తీర్పు మేరకు సీఎంలు, ఎమ్మెల్యేలు లేదా ఇతర ప్రతినిధులు వస్తారు వెళ్తారు. కాని సీఎస్ తీసుకునే నిర్ణయాలు శాశ్వత ప్రాతిపాదికన ఉంటాయి. ప్రజాప్రతినిధులు చట్టాలు చేస్తే.. ఆ చట్టాలు సక్రమంగా అమలు చేసే బాధ్యత కూడా సీఎస్‌దే. రాష్ట్రంలో గవర్నర్, సీఎం, చీఫ్ జస్టిస్‌లు, SEC, చట్టసభల సారధులు, సీఎస్, డీజీపీ..వీరంతా ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపే విషయంలో కీలకమైన వారు.
ఉద్యోగ సంఘాలు ఎందుకు చేరాయి..
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం ఈ అంశం ప్రస్తావనకు వస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఇతర వ్యవస్థలతో పాటు సీఎస్‌దీ కీలక పాత్రే. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు జరపడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా కోరుతూ ప్రభుత్వంతో పాటు..ఉద్యోగ సంఘాలూ సుప్రీంను ఆశ్రయించాయి. ఈ పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, వ్యాక్సిన్ రాక ముందే కొన్ని చోట్ల ఎన్నికలు జరిగాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య జరుగుతున్న వివాదంలో ఉద్యోగ సంఘాలు ఎందుకు చేరాయనే విధంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సిన బాధ్యత సీఎస్‌పై పడిందని చెప్పవచ్చు. అదే సమయంలో ప్రొటోకాల్స్, సమన్వయం విషయంలోనూ ఎన్నికల సంఘం, సీఎస్ పరస్పరం సహకరించుకోవాల్సిందే.
Must Read ;- ఉద్యోగులకు సంఘాలా.. సర్కారుకు బాకాలా!
ఒకవేళ జరగకుంటే..
ఏపీలో ఎన్నికల సంఘంతో జరగాల్సిన సమావేశానికి పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లు హాజరు కాలేదు. ఆ తరువాత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాసినట్లు, ఇప్పటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, వాయిదా వేయాలని కోరినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినా.. రాష్ట్రంలో చాలా చోట్ల నోటిపికేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేయకపోవడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎస్ ప్రభుత్వంలో భాగమే కావచ్చు..కాని ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగం ఏర్పాటు చేసిన స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా, అంతకు ముందే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ప్రకారం నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఏర్పాట్లకు కనీన సన్నద్ధత లేకపోవడంపై విమర్శలూ వచ్చాయి. ఉద్యోగ సంఘాలతో చర్చలనేది తరువాతి అంశమని, తొలుత వ్యవస్థల పరిరక్షణ, సన్నద్ధత అవసరమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాక ఎన్నికల సంఘమే సుప్రీం అని చెప్పారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబుకి కొన్ని విషయాల్లో నివేదికలు కూడా పంపాల్సిన అవసరం లేదని నిబంధనలున్నాయని వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం చూసినా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాక ఎన్నికల సంఘ నిర్ణయాలకు విలువ ఇచ్చి సన్నద్దత ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని చెప్పినా, అంతకుముందే హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read ;- ఏపీ ‘స్థానికం’లో ఉత్కంఠ.. గుజరాత్‌లో ట్విస్ట్
సీఎస్‌కి పరీక్షా కాలం..
తాజాగా సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సీఎస్‌కి పరీక్షాకాలం మొదలైందని చెప్పవచ్చు. ఓవైపు ఉద్యోగ సంఘాలు ఎన్నికల్లో పాల్గొనేది లేదని చెబుతున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చినా నామినేషన్ల ప్రక్రియ మొదలు కాకపోవడం, ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభం కాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను రీషెడ్యూల్ చేసింది. మొదటి విడత ఎన్నికల నోటిపికేషన్ ను నాలుగోవిడతకు వాయిదా వేసి, రెండో విడత షెడ్యూల్ ని మొదటి షెడ్యూల్ గా మార్చుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. గత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. మార్పుల తరువాత ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశకు ఈ నెల 29 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికల సంఘం పరంగా చూస్తే.. సన్నద్ధతకు మరో అవకాశం ఇచ్చిందని చెప్పవచ్చు. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాయడం సంచలనం రేపింది. ఏపీలో ఉద్యోగ సంఘాలు ఎన్నికల్లో పాల్గొనేందుకు నిరాకరిస్తున్నందున ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని కేటాయించాల్సిందిగా కోరుతూ ఆయన లేఖ రాశారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం, రాజకీయ అనిశ్చితి, సంక్షోభాలు లాంటివి తలెత్తినప్పుడు, ఇతరత్రా వర్గపోరు, ప్రాంతీయ వాదం, విభజన వాదం లాంటి పరిస్థితులు, తీవ్రవాదుల లేదా ఉగ్రవాదుల ప్రభావం ఉన్న సమయాల్లో ఇతర ప్రాంతాల నుంచి ఎన్నికల సిబ్బందిని పంపించాల్సిందిగా ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు కేంద్ర సహకారాన్ని కోరతాయి. ఇతర రాష్ట్రాల నుంచి రప్పించుకుంటాయి. ఎన్నికల నిర్వహణకు భద్రతా బలగాలు, పరిశీలకులు ఇతర రాష్ట్రాల నుంచి రావడం సాధారణమే కాని.. కోవిడ్ అంశం నేపథ్యంగా చెప్పి ఉద్యోగ సంఘాలు ఎన్నికలకు సహకరించేందుకు నిరకరించిన కారణంగా ఎన్నికల నిర్వహణ సిబ్బందిని ఇతర రాష్ట్రాల నుంచి రప్పించుకోవడం అంటే రాష్ట్ర ప్రతిష్ట కూడా దెబ్బ తింటుంది. అదే సమయంలో తన ఆదేశాలను అమలు చేయడంలో విఫలం అయ్యారని సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటివి తలెత్తితే.. సీఎస్ స్థానంలో ఎవరున్నా వారికి ఇబ్బందికర పరిణామంగానే మారుతుంది. సీఎంలు జారీ చేసే ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే..అడ్డుకునే అవకాశం, అధికారం ఉన్న సీఎస్ స్వతంత్రంగా వ్యవహరించలేకపోయారన్న అపవాదూ మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఏపీలో వ్యవస్థలపై దాడి జరుగుతోందన్న విమర్శలు ఇప్పటికే ఉన్న నేపథ్యంలో సీఎస్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.
Also Read ;- వెంకట్రామిరెడ్డి.. ఉద్యోగుల హక్కులనూ ‘చంపే’స్తున్నారా?