(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా విశాఖ నగర పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయితే మంత్రుల కార్యక్రమాల్లో మాత్రం ఈ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. మాస్క్ ధరించకుండా రోడ్డెక్కే వారికి జరిమానా విధిస్తారు. వాహనదారులను ఆపి ఈ చలాన్ లు జారీ చేస్తున్నారు. శనివారం ప్రారంభమైన ఈ డ్రైవ్‌లో ఇప్పటివరకు 10 వేల మంది వరకు ఈ చలాన్లు జారీ చేశారు నగర్ పోలీసులు. అయితే యధా రాజా తథా ప్రజా.. అంటారు. ఈ విషయాన్ని విస్మరిస్తున్న మన పాలకులు కోవిడ్-19 నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.
పార్టీ కార్యక్రమాల్లో కానరాని రూల్స్..
పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోమవారం తన సొంత నియోజకవర్గంలో సెక్రటేరియట్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమమే అందుకు ఉదాహరణ. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, స్థానికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అలాగే కార్యకర్తలు జనసమీకరణ చేశారు. సభకు హాజరైన వారిలో 80 శాతానికి పైగా ఎటువంటి మాస్కు ధరించకుండా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దృశ్యం చూసిన ప్రజలు, సామాజిక బాధ్యత కలిగిన పౌరులు బాధ్యత గల మంత్రులు చేయాల్సిన పనేనా? అని ప్రశ్నిస్తున్నారు. రోడ్లపై ఇష్టానుసారంగా వేలాదిమంది పై చలాన్లు విధిస్తున్న పోలీసులకు వీళ్ళు కనిపించలేదా అని నిలదీస్తున్నారు. అమాయకులకు జరిమానాలు విధించడం కాదని, చట్టం, న్యాయం, రూల్స్ అందరి పట్ల ఒకేలా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో తప్పని సరిగా మాస్కు ధరించేలా చూడాల్సిన బాధ్యత నాయకులదే అని స్పష్టం చేస్తున్నారు.
Must Read ;- మాస్క్ మస్ట్, లేదంటే కఠిన చర్యలు : సీపీ అంజనీ కుమార్