దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదన్నది ఓ సామెత.. సాంకేతిక సమస్యలు ఏం ఉన్నాయో కానీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సి.డి.ఎఫ్) శాసన సభ్యులు (ఎమ్మెల్యేలు), శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) ఖర్చు పెట్టడంలో మరీ పిసినారి తనం చూపిస్తున్నారు. పై సామెత వీరికి సరిగ్గా సరిపోలినట్లే అనిపిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలి ప్రభుత్వం 2014లో కొలువు దీరింది. 2014–15 ఆర్ధిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్ధిక సంవత్సరం వరకు అంటే.. ఆరేళ్ల కాలంలో ఏఏ ఆర్థిక సంవత్సరంలో ఎమ్మెల్యేలకు ఎంతె మొత్తంలో నిధులు ఇచ్చిందీ..? ఎమ్మెల్సీలకు ఎంత మొత్తంలో నిధులు ఇచ్చిన వివరాలను రాష్ట్ర ప్రణాళిక శాఖ .. ఓ ఆర్టీఐ దరఖాస్తు దారుకు వివరాలు అందజేసింది. ప్రణాళిక అధికారిక
గణాంకాల మేరకు గడిచిన ఆరేళ్ల కాలంలో తెలంగాణలో ఎమ్మెల్యేలకు రూ.1440 కోట్లు.. ఎమ్మెల్సీలకు రూ.460.5 కోట్లు.. మొత్తంగా రూ.1900.5కోట్ల నిధులు విడుదల చేసింది.
పడకేసిన అభివృద్ధి పనులు
ప్రతీ నియోజకవర్గంలో ప్రజోపయోగమైన అభివృద్ధి పనులు చేపట్టడానికి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి పేర ఎమ్మెల్యేకు ఏటా రూ.3 కోట్లు, ఎమ్మెల్సీలకు ఏటా రూ.3 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఈ నిధులు తమ నియోజకవర్గ పరిధిలో సిమెంటు కాంక్రీట్ (సీసీ) రోడ్లు, మట్టి రోడ్లు, డ్రైనేజీలు, బస్ షెల్టర్లు ఇలా.. ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి వెచ్చించడం ద్వారా సద్వినియోగం చేయాలి. తెలంగాణ రెండో ప్రభుత్వంలో ఇప్పటి దాకా సీడీఎఫ్ కింద నయా పైస ఇవ్వలేదన్నది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆవేదన. కానీ, అంతకు ముందు విడుదల చేసిన నిధుల్లో వీరు ఖర్చు పెట్టకుండా వదిలేసిన నిధులు రూ.698.57 కోట్లు కావడం విశేషం. ఫలితంగా అత్యధిక నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు పడకేశాయి. ఎమ్మెల్యేలకు రూ.1440 కోట్లు విడుదల అయితే.. వారు కేవలం రూ.947.85 కోట్లు మాత్రమే వెచ్చించగా.. రూ.492.15 కోట్లు మిగిలిపోయాయి. ఎమ్మెల్సీలకు రూ.460.5కోట్లు ఇవ్వగా.. వారు రూ.254.08కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. రూ.206.42కోట్లు మిగిలిపోయాయి.
కరోనా ఎఫెక్ట్
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సుమారు రెండు నెలల పాటు అమలైన లాక్‌డౌన్ ఫలితంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆగమాగమైందన్నది ప్రభుత్వ పెద్దల వాదన. ప్రభుత్వ రాబడి పూర్తిగా పడిపోగా.. కరోనా విలయ తాండవ పరిస్థితుల్లో ప్రభుత్వం వెచ్చించిన నిధుల వల్ల.. ఇపుడు ఎమ్మెల్యేలకు సీడీఎఫ్ కింద నిధులు ఇవ్వడం లేదన్న కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్న మాట.
ఈ కారణంగానే 2019–20 ఆర్ధిక సంవత్సరంలో సీడీఎఫ్ నిధులు విడుదల కాలేదు. మరో వైపు లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులకూ ప్రతీ ఏటా రూ.5 కోట్ల నిధులు ఇస్తారు. కానీ, భారత ప్రభుత్వం సైతం కరోనా కష్టకాలమంటూ ఎంపీ ల్యాడ్ (లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ )నిధులకు ఎగనామం పెట్టింది. ఏతా వాతా తేలిందేమంటే.. ఆరేళ్లలో ప్రభుత్వం ఇచ్చిన నిధులను పూర్తి ఖర్చుపెట్టలేక పోయిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు 2019–20 ఆర్ధిక సంవత్సరంలో అసలు పైస కూడా అందలేదు. మరిక పనులెక్కడ..? అభివృద్ధి ఎక్కడ..?











