టీడీపీ అధినేత. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో మరింత దూకుడుగా వెళుతున్నారు. గతంలోనూ ఇదే మాదిరిగా ఉన్నప్పటికీ..,. ఈ మధ్యకాలంలో చంద్రబాబు దూకుడు చూసి అటు పార్టీ నేతలతో పాటుగా ఇటు ప్రజలు కూడా సంబరపడుతున్నారు. అదే సమయంలో బాబు ఆదేశాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగం మాత్రం ఉరుకులు పరుగులు పెట్టక తప్పడం లేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు టీడీపీతో పాటుగా ఆ పార్టకి మద్దతుగా నిలిచిన బీజేపీ, జనసేనలకు ఇచ్చిన సీట్లను చూసి సంబ్రమాశ్చర్యాలకు గురైన చంద్రబాబు… తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఎంత చేసినా తక్కువేనన్న భావనతో కదులుతున్నారు.
ఇదే మాటను ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో పదే పదే చెప్పారు కూడా. ఈ కుప్పం పర్యటనలోనే చంద్రబాబు చేసిన ఓ పనికి స్థానిక రైతు ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. ఆనక తేరుకుని చంద్రబాబుకు మనస్ూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నారు.
అసలు చంద్రబాబు ఏం చేశారు?… ఆ రైతు ఎందుకు అంతగా షాక్ అయ్యారు?… అన్న విషయంలోకి వెళితే… ఏకబిగిన 3 రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్థానికప్రజల సస్యల పరిష్కారం కోసం నూతనంగా జన నాయకుడు పేరిట ఓ పోర్టల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుప్పం పరిధిలోని శాంతిపురం మండలం, సోమాపురానికి చెందిన రైతు చలపతి అక్కడికి వచ్చి తన సమస్యను చంద్రబాబు ముందు పెట్టారు. అప్పు చేసి బోరు వేసుకున్నానని, అయితే పంపు కొనుగోలు చేసుకునేందుకు తన వద్ద సొమ్ము లేదని వాపోయాడు. ఉన్న చిన్నపాటి పొలం ద్వారా వచ్చేఆదాయం అంతా అప్పు తీర్చేందుకే సరిపోతున్నందున…ఇక పంపుసెట్టు కొనుక్కునేదెక్కడ అంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. చలపతి చెప్పినదంతా విన్న చంద్రబాబు…చలపతికి పంపుసెట్టుతో పాటుగా పైపులు కూడా అందజేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత చంద్రబాబుతో పాటు ఆ రైతు కూడా ఎవరి పనుల్లో వారు పడిపోయారు.
ఇదంతా ఉదయం జరిగితే… సాయంత్రానికే చలపతి పొలం వద్దకు పంపుసెట్టు, పైపులు పట్టుకుని అధికారులు వచ్చారు. వారిని చూసి చలపలి నిజంగానే షాక్ కు గురయ్యారట. అదేంటీ… ఏదో చంద్రబాబు వచ్చారు కదా అని తన సమస్యను వివరిస్తే…సాయంత్రానికే తన సమస్య పరిష్కారం అయిపోయిందా? అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం చంద్రబాబు ఆదేశాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చాలా వేగంగా స్పందించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను పరుగులు పెట్టించి మరీ…చలపతికి కావాల్సిన పంపుసెట్టు, పైపులను కొనుగోలు చేయించారు.
అంతేకాకుండా వాటిని చంద్రబాబు హామీఇచ్చిన రోజే రైతు చేతికి చేరిపోవాలన్న దిశగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంపుసెట్టు, పైపులు పట్టుకుని చలపతి వద్దకు ఆర్ డబ్ల్యూఎస్ అదికారులు పరుగులు పెట్టారు. అలా ఉదయం చంద్రబాబు హామీ ఇస్తే… సాయంత్రానికే ఆ హామీ అమలు అయిపోయిందన్న మాట.