బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఏపీ నుంచి పురంధేశ్వరికి, తెలంగాణ నుంచి డీకే అరుణకు కీలక పదవులు దక్కాయి. పురంధేశ్వరిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే తెలంగాణలో సీనియర్ నేత డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి వరించింది. ఏపీకి చెందిన సత్యకుమార్ కు జాతీయ కార్యదర్శుల జాబితాలో చోటు దక్కింది. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత లక్షణ్ ను, బీజేపీ ఓబీసీ విభాగం అధ్యక్షుడిగా నియమించి సీనియారిటీకి ప్రాధాన్యం ఇచ్చారు.
వీర్రాజుకు చెక్ పెట్టినట్టేనా?
ఏపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరికి బీజేపీ పెద్దపీట వేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తాజాగా ప్రకటించిన కార్యవర్గంలో పురంధేశ్వరికి బీజీపీ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. ఏపీ బీజేపీ బాధ్యతలు సోము వీర్రాజుకు అప్పగించారు. హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా, సోము స్పందించిన తీరు ఢిల్లీ నేతలకు ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. అందుకే మాటల తూటాలతో ఏపీ అధికారపక్షాన్ని ఇరుకున పెట్టగలిగే సామర్ధ్యం ఉన్న పురంధేశ్వరికి కీలక పదవి అప్పగించారని తెలుస్తోంది.
కన్నాకు మొండిచేయి
రెండు సంవత్సరాల పాటు ఏపీ బీజేపీ బాధ్యతలు మోసిన కన్నా లక్ష్మీనారాయణకు మొండిచేయి చూపించారు. అయితే కన్నాకు రాజ్యసభ సీటు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సరైన సమయంలో కన్నాకు పదవి లభిస్తుందని, ఆయన సేవలు తప్పనిసరిగా బీజేపీ ఉపయోగించుకుంటుందని భావిస్తున్నారు. కన్నా కూడా కేంద్ర బీజేపీపై నమ్మకం పెట్టుకున్నారు. కొంత ఓపిక పడితే ఆశించిన పదవి దక్కుతుందని ఆయన ఆశాభావంతో ఉన్నారు.
తెలంగాణలో దూకుడుపెంచినట్టే?
తెలంగాణలో తెరాస ప్రభుత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడే నేతల్లో డీకే అరుణ ఒకరు. దక్షిణ తెలంగాణలో మంచి పట్టున్న నేత కావడంతో ఆమెను బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి వరించిందని తెలుస్తోంది. త్వరలో హైదరాబాద్ కార్పొరేషన్ కు కూడా ఎన్నికలు ఉండటంతో తెలంగాణలో బలపడాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న బీజేపీ ఇద్దరు కీలక నేతలకు పదవులు కట్టబెట్టింది. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు కూడా జాతీయ స్థాయిలో మంచి పదవి లభించినట్టే.
ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ కు ప్రమోషన్ లభించిందనే చెప్పొచ్చు. ఏది ఏమైనా ఏపీ, తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది.