స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. ఈ చిత్రానికి క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ సికింద్రాబాద్ లో జరిగింది. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ తదితరుల పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తో పుష్ప షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని వార్తలు వచ్చాయి. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కోసం మళ్లీ మారేడుమిల్లి వెళ్లారని తెలిసింది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. పుష్ప కథ అంతా కూడా అడవి నేపథ్యంలోనే నడుస్తుంది. అందువలన ఈ సినిమాకి సంబంధించిన షూటింగు ఎక్కువగా మారేడుమిల్లి, రంపచోడవరం అటవీ ప్రాంతాల్లో జరిగింది. గతంలో అక్కడ కొంతకాలం పాటు ఉండి షూటింగు చేసుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా టీమ్ మారేడుమిల్లి బాటపట్టింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారని తెలిసింది. ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్ తో షూటింగు పార్ట్ పూర్తవుతుందని సమాచారం. అక్టోబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసి, క్రిస్మస్ కి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది ప్లాన్.
అల్లు అర్జున్ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప ఫస్ట్ సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే విలన్ ఫహద్ ఫాజిల్ లుక్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. బన్నీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మరి.. బన్నీ ఈ పాన్ ఇండియా మూవీతో ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.











