రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫిబ్రవరి 17న జరిగిన లాయర్ దంపతులు వామన్ రావు-నాగమణి జంట హత్యల కేసులోపెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును అరెస్టు చేసినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొత్తం అంశాలు తెరపైకి వస్తున్నాయి. అదే సమయంలో వామనరావు తండ్రి కిషన్ రావు చేసిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. వారం రోజులుగా అండర్ గ్రౌండ్ కి వెళ్లినట్టు చెబుతున్న పుట్ట మధును భీమవరంలో పోలీసులు అరెస్టుచేశారు. ప్రస్తుతం రహస్యంగా విచారిస్తున్న తెలుస్తోంది. పోలీసులు అధికారికంగా ఈ విషయంపై ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఇక పుట్ట మధు అరెస్టు తరువాత కిషన్ రావు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు, కోడలు హత్యకు ముందు పుట్ట మధు కేంద్రంగా భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయని, ఇందులో గ్రామస్థాయినుంచి మొదలు హైదరాబాద్ వరకు కొందరు కుట్ర చేశారని ఆరోపించారు. ఓమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటల రాజేందర్ పేరునూ ప్రస్తావించారు. రూ.2కోట్ల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. మాజీ మంత్రి అండతోనే పుట్ట మధు అంతకు తెగించాడని, అప్పట్లో కొందరు పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో డైరెక్ట్ గా కొన్ని అనుమానాలు వెల్లడించలేదన్నారు. అసలు నిందితులను ఎఫ్ ఐ ఆర్ లో చేర్చలేదని, తాను ఇందుకోసం పోరాటం చేస్తున్నానన్నారు. కాగా ఈ కేసులో పుట్ట మధు మనల్లుడు కుంట శ్రీను (బిట్టు శ్రీను) ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు సంచలనం రేపాయి.
పుట్టమధు ఇటీవలే మంత్రి వర్గంనుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ కు సన్నిహితుడిగా పేరుంది. ఈటల కుమారుడితోనూ పుట్టమధుకు కొన్ని వ్యాపార లావాదేవీలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలకు మాత్రం ఇప్పటివరకు ఎవరూ ఎలాంటి ఆధారాలూ బయటపెట్టలేదు. మరోవైపు తనకు పౌల్ట్రీ వ్యాపారంతోపాటు కొన్ని భవనాల అద్దెలు మాత్రమే ఆదాయ మార్గమని, ఎలాంటి వ్యాపారాలు లేవని ఈటల గతంలో పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఈటల కుమారుడు ఇంకేమైనా ఇతర వ్యాపారాలు, లావాదేవీలు నిర్వహిస్తున్నారా అనే చర్చకూడా మొదలైంది.
ఆ ఎమ్మెల్యే ఫోన్ చేశారా..
కాగా వామన్ రావుపై హత్యాయత్న జరిగిన సమయంలో సహాయం కోసం వచ్చిన అంబులెన్స్ ను వెనక్కి పంపించారని, తరువాత మరో అంబులెన్స్ వచ్చిందని వామన్ రావు తండ్రి కిషన్ రావు ఆరోపించారు. వామన్ రావును ఆసుపత్రికి తీసుకెళ్లినా వైద్యం చేయకూడదని పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఫోన్లు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ఎమ్మెల్యే ఎవరనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
వేగంగా బదిలీలు..
ఈటలను మంత్రివర్గంనుంచి తొలగించడం, పుట్టమధును అరెస్టు చేయడంతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. హుజూరాబాద్, మంథని, ధర్మపురి, జమ్మికుంట డివిజన్ల పరిధిలో పలువురు పోలీసులు అధికారులను బదిలీచేశారు. దీంతోపాటు పలువురు రెవెన్యూ,పంచాయతీ రాజ్ శాఖకు చెందిన అధికారులను బదిలీచేశారు. బదిలీ అయినవారిలో చాలామంది ఈటల, పుట్ట మధుల సిఫారసులతో గతంలో పోస్టింగ్ పొందినవారు ఎక్కువగా ఉన్నారన్న చర్చ నడుస్తోంది.











