ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం, మాస్క్ లు, పరిశుభ్రత మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రాథమిక మార్గాలు. వ్యాక్సినేషన్ పూర్తయినా.. ఈ ప్రాథమిక మార్గాలు మాత్రం అనుసరించాల్సిందే. కొవిడ్ కి ముందు చాలావరకు ఆసుపత్రుల్లో ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లకు వెళ్లివచ్చేవారిలో లేదా కొన్ని ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి మాత్రమే మాస్క్ వినియోగించారు. డస్ట్ ఎలర్జీ లాంటి సమస్యలు, పొల్యూషన్ సమస్యలుంటే కూడా మాస్క్ లేదా కర్చీఫ్, స్కార్ఫ్ లతో ముక్కు, నోరును కవర్ చేసేవారు. కొవిడ్ కారణంగా ఇల్లు దాటితే చాలా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఇక గతంలోనూ ప్రపంచంలోని పౌరులంతా మాస్క్ లు ధరించాల్సి వచ్చింది. 1918లో స్పెయిన్ లో పుట్టిన స్పానిష్ ఫ్లూ. ఓ సైనిక కందకంలో అపరిశుభ్రత కారణంగా (ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి) వ్యాపించిన ఈ ఫ్లూ కారణంగా ప్రపంచ వ్యాప్తాం 5కోట్ల మంది చనిపోయినట్టు అంచనా. భారత్, చైనాలో దాదాపు కోటిమంది చనిపోయినట్టు అంచనా. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ఎన్నోరెట్లు ప్రాణనష్టం వచ్చింది. 1886-1914 మధ్య 80 లక్షల మంది భారతీయులను బలితీసుకున్న ప్లేగు వ్యాధికంటే భయంకరమైన వ్యాధిగా తేలింది. అప్పట్లో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులకు ఎక్కువగా అటాక్ కావడంతో చాలావరకు యువత చనిపోయినట్టు కథనాలున్నాయి. మొత్తం రెండు విడతలుగా వచ్చిన స్పానిష్ ఫ్లూ, మొదటివిడత కంటే రెండో విడతలో ఎక్కువ మంది మరణానికి కారణమైంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనూ ఈ ఫ్లూ ఉన్నా బ్రిటన్, బ్రిటీష్ పాలనలో ఉన్న దేశాల్లో యుద్ధానికి ప్రాధాన్యం ఇచ్చారని, తద్వారా ఫ్లూ వ్యాప్తి ఎక్కువైపోయిందన్న మరో వాదనా ఉంది. యుద్ధం కోసం సేనలు తరలింపు, ఆయుధాల రవాణా, సైనిక క్యాంపులు, ఆయుధాల తయారీ ఫ్యాక్టరీల్లో ఈ ఫ్లూ విపరీతంగా ప్రబలినట్టు అప్పట్లో 1919లో రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్‌కు సర్ ఆర్థర్ న్యూస్‌హోమ్ నివేదిక కూడా ఇచ్చారని కథనాలూ ఉన్నాయి. ఈ మహమ్మారినుంచి తప్పించుకోవాలంటే ఇళ్లల్లో ఉండడం ఒక్కటే మార్గమని సూచిస్తూ సర్ అర్థర్ రాసిన మెమొరాండం ఫర్ పబ్లిక్ యూజ్ను ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలూ వచ్చాయి. ఆ విమర్శల విషయం పక్కన బెడితే.. అప్పట్లో ప్రపంచంలో యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులోకి రాలేదు. విదేశీ వైద్య విధానాలుకూడా ఆయా దేశాలకు పెద్దగా తెలియని పరిస్థితి. రవాణాకూడా కష్టమైన పరిస్థితుల్లో మాస్క్ వాడడం, శానిటైజర్లు (అప్పట్లో స్థానికంగా అందుబాటులో ఉండే కిరోసిన్, కార్బైడ్ ఆధారిత) వాడడం మొదలుపెట్టారు. బ్రిటన్ లో ఈ ఫొటోలు ఇప్పటికీ ఉండడమే ఇందుకు సాక్ష్యం. అప్పట్లోనూ పార్కులు, నాట్యమండళ్లు (డాన్స్ హాళ్లు, క్లబ్ లు), చర్చిలు పాక్షికంగా మూసేశారు. ముక్కు, నోటి తుంపర్లద్వారా ఈ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంల అందుకు అనుగుణంగా 1918 నవంబర్‌లో న్యూస్ ఆఫ్ ద వరల్డ్ పత్రిక తమ పాఠకులకు సూచించింది. అప్పట్లో కాటన్ మాస్క్ లు, క్లాత్ మాస్క్ లు తయారుచేసి వాడారు. రాత్రివేళల్లో ఇళ్లలో ఉన్న సమయంలో మాస్క్ లు వాడకుండా.. ముక్కు, నోరు శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వాలు పలుమార్లు సూచించాయి
మాస్క్ ల తయారీ ఇదీ..
1918కి ముందే అక్కడక్కడ మాస్క్ ల వినియోగం ఉండేది. ఆఫ్రికా దేశాల్లో పొడవైన, తక్కువ వెడల్పు ఉండే ఆకులు, చెట్టు బెరుడులతో తయారుచేసే మాస్కులు వాడినట్టు చరిత్ర చెబుతోంది. 1910లో ప్లేగు వ్యాధినుంచి బయటపడేందుకు చైనాలో ఓ న్యాయస్థాన ఉద్యోగి మాస్క్ వాడినట్టు చెబుతారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో గ్యాస్ మాస్క్ లు వినియోగించారు. అయితే 1918లో ప్రపంచవ్యాప్తంగా మాస్క్ ధరించడం పరిచయమైంది. అప్పటి పరిస్థితుల ప్రకారం కాటన్ మాస్క్ కు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే పలు పరిశోధనల తరువాత N95మాస్క్ అందుబాటులోకి వచ్చింది. 1970లో అమెరికాలో గనుల కార్మికులకు, వస్త్ర పరిశ్రమలు, పాలిమర్స్ లో పనిచేసే వారికి ఒకేసారి వాడి పడేసే (సింగిల్ యూజ్)మాస్క్ లు వినియోగించారు. 1972లో 3M కంపెనీ రెస్పిరేటర్ లేయర్స్మాస్క్ లను రూపొందించింది. చాలా కాలం వరకు ఫ్లూలనుంచి రక్షణకు ఈ మాస్క్ లనే వాడేవారు. 1992లో తైవాన్ కు చెందిన ప్రొఫెసర్ పీటర్ తై కొన్ని లోహాలను వినియోగించి పూర్తిస్థాయి N95 మాస్క్ రూపొందించారు. 1995లో ఈ మాస్క్ కు పేటెంట్ కూడా వచ్చింది. ట్యూబర్‌కులోసిస్ నుంచి ఈ మాస్క్ ప్రాచుర్యంలోకి వచ్చింది.











