టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొడుతోంది. వరుస విజయాలు నమోదు చేస్తూ.. దూకుడును ప్రదర్శిస్తోంది. మొదటి పోరులోనే శుభారంభం చేసి తన సత్తా ఎంటో చాటింది. తొలి మ్యాచ్‌లో వరల్డ్ 58వ ర్యాంకర్ ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై గెలిచింది. వరుస సెట్లలో 21-7, 21-10 తేడాతో సింధు అద్భుత విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్ ను ముగించడం విశేషం.
క్వార్టర్స్ ఫైనల్స్ లోకి..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ పీవీ సింధు పతకానికి మరింత చేరువైంది. ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో భాగంగా నేడు డెన్మార్క్ కు చెందిన 12వ ర్యాంక్ క్రీడాకారిణి బ్లింక్ ఫెల్ట్ తో జరిగిన పోరులో వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. తొలి నుంచి దూకుడు ప్రదర్శించిన సింధు.. 21-15, 21-13తో అలవోకగా విజయం సాధించింది. 40 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగించింది. మునుముందు కూడా సింధు ఈ దూకుడే ప్రదర్శిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరడం ఖాయం. ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో ఆమె రజత పతకం గెలుచుకున్నారు. ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రజత పతకం అందించిన మొదటి క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈసారి సింధు స్వర్ణ పతకం గెలిచే అవకాశాలున్నాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
Must Read ;- అప్పుడు కరణం.. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు చాను!











